- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగు రాష్ట్రాలపై చలి పంజా.. అల్లూరి జిల్లాలో అత్యల్పం!
తెలుగు రాష్ట్రాలపై చలి (Cold) పులిలాగా పంజా విసురుతోంది. ఓ వైపు పొగ మంచుతో వాడలు, వీధులు, రహదారులను కప్పేస్తూనే, మరో వైపు ఎముకలు కొరికే చలితో వణికిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాలపై చలి (Cold) పులిలాగా పంజా విసురుతోంది. ఓ వైపు పొగ మంచుతో వాడలు, వీధులు, రహదారులను కప్పేస్తూనే, మరో వైపు ఎముకలు కొరికే చలితో వణికిస్తోంది. ప్రధాన రహదారులు, హైవేలపై మందంగా కురుస్తున్న పొగ మంచుతో వాహనాల రాకపోకలకు పెద్ద తిప్పలే వస్తున్నాయి. హెడ్ లైట్లను వేసుకొని జాగ్రత్తగా వాహనదారులు తమ వాహనాలను నడపాల్సిన పరిస్థితి పలు ప్రాంతాల్లో కనిపిస్తోంది. ఇలా మునుపటి రోజు సాయంత్రం ప్రారంభమయ్యే చలి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు గజగజలాడేలా చేస్తోంది. ప్రజలు చలి వేళ బయటకు రావాలంటే వణికిపోయే పరిస్థితి నెలకొంటోంది. డిసెంబర్ (December) మాసం ముందుకు వెళ్తుండడం, జనవరి మాసం దగ్గరకు ప్రయాణిస్తుండడంతో చలి పులి మరింత రెచ్చిపోతోంది. దీంతో అక్కడక్కడ చలి బారి నుంచి తప్పించుకునేందుకు చలి మంటలు కాచుకుంటున్నారు ప్రజలు. మరికొందరు దుప్పటి తన్ని పడుకొంటూ సూర్యుడు పలకరించే వరకు నిద్రపోతున్నారు. అత్యవసర పనులు, రోజువారీ కార్యకలాపాలు చేసుకునేవారు వెచ్చదనం ఇచ్చే దుస్తుల దుమ్ము దులిపి వాటిని శుభ్రపరచుకొని ధరిస్తున్నారు. అలా చలి పులి పంజా నుంచి తప్పించుకునేందుకు తమ వంతు ప్రయత్నాలను చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ జనవరి సమీపిస్తున్న కొద్ది చలి ప్రభావం పెరుగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. అనారోగ్యం కలిగితే ఏ మాత్రం అశ్రద్ధ వహించొద్దని స్పష్టం చేస్తున్నారు. వైద్యులను సంప్రదించి సరైన చికిత్సను పొందాలని కోరుతున్నారు. ఆహారం కూడా వేడిగా, తాజాగా తినాలని అంటున్నారు.
అల్లూరి జిల్లాలో అత్యల్పంగా..
చలి కాలం (Winter) కావడంతో ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ముఖ్యంగా అల్లూరి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు దారుణంగా నమోదవుతున్నాయి. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఏజెన్సీ ప్రాంతవాసులతో పాటు టూరిస్టులను తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రతలు గజగజ వణికేలా చేస్తున్నాయి. అల్లూరి జిల్లాలోని జి.మాడుగులలో 10 డిగ్రీలు, అరకులో 11 డిగ్రీలు, పాడేరులో 12 డిగ్రీలు, చింతపల్లిలో 12.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. ప్రజలు చలి పులి విసిరే పంజా నుంచి తప్పించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగం కోరుతోంది.






