వైసీపీ ఎమ్మెల్యే ఫేటు మార్చిన సీఎం జగన్: ఓడిపోతాడనకున్న ఎమ్మెల్యే గెలుపు అంచులకు

by Disha Web Desk 21 |
వైసీపీ ఎమ్మెల్యే ఫేటు మార్చిన సీఎం జగన్: ఓడిపోతాడనకున్న ఎమ్మెల్యే గెలుపు అంచులకు
X

దిశ, డైనమిక్ బ్యూరో : అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో అక్కడక్కడ అసంతృప్తి ఉండటం అనేది సహజం. ఆ అసంతృప్తి అనేది వచ్చే ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇది రాజకీయాల్లో సర్వసాధారణంగా జరుగుతూనే ఉంది. ఇలానే విశాఖపట్నం జిల్లాకు చెందిన ఓ మాజీమంత్రి, వైసీపీ ఎమ్మెల్యేకు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. అలాంటి ఎమ్మెల్యే వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఇప్పుడు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అదేంటి ఇంతలా ప్రజలను ఏం చేసి తనవైపునకు తిప్పుకున్నారు అనే సందేహం వస్తుంది కదూ. ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏం చేయలేదు కానీ సీఎం వైఎస్ జగన్ ఆ ఎమ్మెల్యే పాలిట వరంగా మారారు. సీఎం వైఎస్ జగన్ ఏం ప్రారంభించినా అది సదరు ఎమ్మెల్యే నియోజకవర్గం కావడంతో అది ప్లస్‌గా మారింది. ఓటమి అంచుల నుంచి గెలుపు తీరాలకు ఆ సదరు ఎమ్మెల్యే వెళ్లిపోయారు. ఇంతకీ సదరు ఎమ్మెల్యే ఎవరో ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది కదూ అవంతి శ్రీనివాసరావు. ఇంతకీ అవంతి శ్రీనివాసరావుకు కలిసి వచ్చేలా సీఎం వైఎస్ జగన్ ఏం చేశారు...జగన్ రాకతో అవంతి పంటపడటానికి గల కారణాలేంటో ఓసారి చూద్దాం.

అవంతి శిబిరంలో ఆందోళన

తెలుగుదేశం పార్టీ ఎంపీగా కొనసాగుతున్న అవంతి శ్రీనివాస్ ఇంకా పదవిలో ఉండగానే టీడీపీకి గుడ్ బై చెప్పేసి వైసీపీలో చేరిపోయారు. 2019 ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన అవంతి శ్రీనివాస్‌ జగన్ కేబినెట్‌లో ఏకంగా మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. మంత్రిగా ఉండగానే అవంతి శ్రీనివాస్ అనేక వివాదాలను ఎదుర్కొన్నారు. ఓ మహిళతో అవంతి శ్రీనివాస్ మాట్లాడిన ఆడియో అప్పట్లో కలకలం సృష్టించింది. అనంతరం భూ ఆక్రమణలు వంటి ఆరోపణలు సైతం ఎదుర్కొన్నారు. అనంతరం కేబినెట్ విస్తరణలో ఉద్వాసనకు గురయ్యారు. మంత్రి వర్గం నుంచి ఉద్వాసనకు గురైన అనంతరం అవంతి శ్రీనివాస్ కొన్ని రోజులు దూకుడు ప్రదర్శించినప్పటికీ అనంతరం సైలెంట్ అయిపోయారు. ముఖ్యమంత్రి లేదా వీఐపీలు పర్యటిస్తున్న సమయంలో అలా ఓ మెరుపులా మెరిసి వెళ్లిపోతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కూడా అనేక సందర్భాల్లో పరాభవాలు ఎదుర్కొన్నారు. దీంతో ప్రజల్లో అవంతి శ్రీనివాస్‌కు తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రచారం జరిగింది. వైసీపీ టికెట్ ఇచ్చినా వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారనే ప్రచారం కూడా జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదు అని అంతా భావించారు. ఇక అవంతి శ్రీనివాస్ ప్రత్యర్థి వర్గం అయితే ఇక అవంతి రాజకీయ భవిష్యత్ అగమ్య గోచరం అని ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారం అవంతి శ్రీనివాస్ శిబిరంలో ఆందోళనలు రేపాయి.

అవన్నీ అవంతి ఖాతాలోనే

వచ్చే ఎన్నికల్లో అవంతి శ్రీనివాస్ పరిస్థితి ఏంటా అనే చర్చ జరుగుతున్న తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వారిపట్ల వరంగా మారింది. నిన్నమెున్నటి వరకు అవంతికి టికెట్ రాదు.. ఇచ్చినా గెలవరు అనే పరిస్థితి నుంచి నేడు అవంతి అదృష్టం వేరే లెవెల్ లో ఉంది అని అంటున్నారు. ఇంతకీ అందుకు కారణం లేకపోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రూపంలో అవంతి శ్రీనివాస్ అదృష్టం తన్నుకువచ్చిందంటున్నారు. విశాఖలో సీఎం వైఎస్ జగన్ చేసే ప్రారంభోత్సవాలు, కొత్త ప్రాజెక్టులు అన్నీ కూడా భీమిలీ నియోజకవర్గం పరిధిలోనే ఉండడం విశేషం. ఇటీవల సీఎం వైఎస్ జగన్ ప్రారంభించిన ఇన్ఫోసిస్ కార్యాలయం భీమిలి పరిధిలో ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమరావతి నుంచి విశాఖకు డిసెంబర్‌లో షిఫ్ట్ అవుతున్నట్లు ప్రకటించారు. ఇకపై విశాఖ నుంచే ప్రభుత్వ పరిపాలన జరుగుతుందని ప్రకటించారు. వైఎస్ జగన్ మార్చాలనుకుంటున్న తన మకాం కూడా భీమిలీలోనే జరగనుంది. రుషికొండ మీద ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేయబోతున్నారు. అది కూడా భీమిలి నియోజకవర్గం పరిధిలోనే ఉంది. ఇలా ఏం చేసినా... ఏం ప్రారంభించినా అది భీమిలి నియోజకవర్గం పరిధిలో ఉండటంతో ఆ క్రెడిట్ అంతా అవంతి శ్రీనివాస్ అకౌంట్లో పడుతుందని తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా అవంతి పొలిటికల్ ఫ్యూచర్‌లో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయని ఆయన అనుచరులు చెప్తున్నారు. ఇవే వచ్చే ఎన్నికల్లో అవంతి శ్రీనివాస్ గెలుపును ప్రభావితం చేస్తాయని అనుచరులు అంటున్నారు.

గేర్ మార్చిన మాజీమంత్రి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రుషికొండకు మకాం మార్చితే ఆ నియోజకవర్గంలో గెలుపొందాలని వైసీపీ ఫుల్ ఫోకస్ పెడుతుంది. జగన్ ఉన్న చోట వైసీపీని గెలిపించుకోవాలన్న పట్టుదల పంతం కచ్చితంగా ఉంటాయి కాబట్టి భీమిలీ సీటుని ఎలాగైనా ఫ్యాన్ ఖాతాలో పడేలా చూస్తారని అంటున్నారు. క్యాంపు ఆఫీస్ కూడా భీమిలి నియోజకవర్గం పరిధిలో ఉండటంతో అక్కడ నుంచి వ్యూహాలు రాజకీయం ఎత్తుగడలు అన్నీ కూడా వైసీపీ ఎమ్మెల్యే గెలుపునకు సహకరిస్తాయని అవంతి అనుచరులు భావిస్తున్నారు. ఈ పరిణామాలతో ఇప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న మాజీమంత్రి అవంతి శ్రీనివాస్ రెట్టింపు ఉత్సాహంతో గేర్ మార్చి స్పీడ్ పెంచేశారు. వచ్చే ఎన్నికల్లో తనదే టికెట్ అని అంటున్నారు. అంతేకాదు ముఖ్యమంత్రి రాక.. తన గెలుపునకు పూలబాట అని అవంతితో పాటు ఆయన అనుచరులు భావిస్తున్నారు. మెుత్తానికి సీఎం వైఎస్ జగన్ రాక అవంతి శ్రీనివాస్ పొలిటికల్ ఫ్యూచర్‌ను ఎంతలా మార్చేసింది అనే చర్చ భీమిలి పొలిటికల్ సర్కిల్‌లో జరుగుతుంది.

Read More..

బ్రేకింగ్: చంద్రబాబుకు మరోసారి నిరాశ.. క్వాష్ పిటిషన్ వాయిదా వేసిన సుప్రీం కోర్టు

Next Story

Most Viewed