ఇజ్రాయెల్ ప్రతినిధి బృందంతో సీఎం ఫలవంతమైన చర్చలు

by Thanuru Gopichand |   (  Updated:2026-01-21 05:30:31  IST  )

ఏపీలో మొదలుకానున్న పెట్టుబడుల వెల్లువ.

ఇజ్రాయెల్ ప్రతినిధి బృందంతో సీఎం ఫలవంతమైన చర్చలు
X

దిశ, వెబ్ డెస్క్ : స్విట్జర్లాండ్ లోని దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు చురుకుగా వ్యవహరిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ ప్రతినిధి బృందంతో సీఎం కీలకమైన భేటీని నిర్వహించారు. ఈ భేటీలో ఫలవంతమైన చర్చలను జరిపారు. ఇజ్రాయెల్ ఆర్థిక, పరిశ్రమల శాఖ మంత్రి నిర్ బర్కత్, ట్రేడ్ కమిషనర్ రోయ్ ఫిషర్, స్విట్జర్లాండ్‌లోని ఇజ్రాయెల్ ఆర్థిక-వాణిజ్య మిషన్ హెడ్ షీర్ స్లట్జ్‌కీలతో సీఎం చంద్రబాబు విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ప్రధానంగా రక్షణ (Defence), ఏరోస్పేస్, డ్రోన్ (UAV) ఎకోసిస్టమ్స్ వంటి వ్యూహాత్మక రంగాలలో భాగస్వామ్య అవకాశాలపై దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్‌ను సాంకేతిక, పారిశ్రామిక హబ్‌గా మార్చే లక్ష్యంతో అత్యాధునిక ఇజ్రాయెల్ సాంకేతికతను రాష్ట్రానికి రప్పించేందుకు సీఎం ప్రత్యేక చొరవను చూపించారు.

ఈ చర్చలలో భాగంగా సెమీకండక్టర్ తయారీ, క్వాంటం లీడర్‌షిప్, సైబర్ సెక్యూరిటీ, వైద్య రంగాలలో పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలను ఇరుపక్షాలు సమాలోచనలు జరిపారు. ముఖ్యంగా ఏపీలో నీటి సమస్యల పరిష్కారానికి సంబంధించి డీశాలినేషన్, భూగర్భ జలాల నాణ్యత మెరుగుదలపై ఇజ్రాయెల్ సహకారాన్ని సీఎం కోరారు. వీటితో పాటు విద్యా రంగంలో సంస్కరణలు, నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన అంశాలు కూడా వారితో చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని ఇజ్రాయెల్ ప్రతినిధి బృందానికి సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు. ఇజ్రాయెల్ కంపెనీలు రాష్ట్రంలో తమ కార్యకలాపాలను విస్తరించాలని ఆహ్వానించారు. ఈ భాగస్వామ్యం రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలకు, భారీగా ఉద్యోగ అవకాశాల కల్పనకు మార్గం సుగమం చేయనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read More..

దావోస్‌లో డొనాల్డ్ ట్రంప్ విందు.. ఏడుగురు భారతీయ సీఈఓలకు ఆహ్వానం


Next Story