- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళలకు తీరని అన్యాయం.. ఇది జాతి విద్రోహం : సీఎం చంద్రబాబు
మహిళలు తమ హక్కుల్ని పోరాడి సాధించుకునే సమయంలో.. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం క్షమించరాని నేరమని సీఎం పేర్కొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును విపక్షాలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ.. తూర్పుగోదావరి జిల్లా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నిర్వహించిన ర్యాలీలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. హెలీప్యాడ్ నుంచి స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర సభా వేదిక వరకూ ఈ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మహిళలు తమ హక్కుల్ని పోరాడి సాధించుకునే సమయంలో.. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం క్షమించరాని నేరమన్నారు. తమకు రిజర్వేషన్లు వస్తాయని, చట్టసభల్లో చోటుదక్కుతుందని ఎంతో ఆశతో ఎదురుచూసిన మహిళలకు విపక్షాలు నిరాశను మిగిల్చాయన్నారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మహిళా బిల్లును అడ్డుకుని ద్రోహం చేయడం జాతి విద్రోహంగా పేర్కొన్నారు. చిన్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని విపక్షాలు ఆరోపించాయి కానీ.. మహిళలకే అన్యాయం చేశాయని మండిపడ్డారు. ఈ బిల్లు వల్ల దక్షిణాది, ఈశాన్య, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్రం స్పష్టతనిచ్చిందని గుర్తుచేశారు. మహిళల రిజర్వేషన్ల కోసం మూడు దశాబ్దాలుగా పోరాడుతుంటే.. ఆ పోరాటం ఫలించే వేళ అడ్డుకోవడం క్షమించరాని నేరమన్నారు. మహిళలను గౌరవించి, అన్నిరంగాల్లో ఆదరించడం మన సంస్కృతి అని, అలాంటి సంస్కృతి, సంప్రదాయాలకు భిన్నంగా నిన్న విపక్షాలు ద్రోహం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న నిరసనలు ప్రారంభం మాత్రమేనని, మహిళా లోకమంతా ఏకమైందని, ముందు ముందు చాలా చూస్తారన్నారు. మహిళలు ఆత్మగౌరవంతో ముందుకెళ్లాలని కోరారు.






