వడ్డె ఓబన్న శౌర్యాన్ని స్మరించుకున్న సీఎం చంద్రబాబు

by Thanuru Gopichand |

ఓబన్నకు తగిన గుర్తింపునివ్వాలని వడ్డెర కులస్తుల డిమాండ్.

వడ్డె ఓబన్న శౌర్యాన్ని స్మరించుకున్న సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్ : నేడు వడ్డె ఓబన్న (Vadde Obanna) జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా వడ్డెర కులస్తులు ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. రేనాటి ప్రాంతంలో జన్మించిన ఓబన్న బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేశారు. రేనాటి పాలేగాళ్లకు, కంపెనీకి మధ్య తవర్జీ విషయంలో ఘర్షణలు ప్రారంభమైనప్పుడు ఆయన రేనాటి వీరుల పక్షాన నిలబడ్డారు. క్రమేపి బ్రిటీషర్లపై తిరుగుబాటు చేశారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చేసిన సాయుధ పోరులో వడ్డె ఓబన్న సైన్యాధక్షుడిగా వ్యవహరించారు. వడ్డెర్లు, బోయలు, చెంచులతో కూడిన సంచార తెగల సైన్యాన్ని సమర్ధవంతంగా నడిపించారు. దట్టమైన నల్లమల అడవుల్లో సైతం ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యాన్ని ఊచకోత కోసి ఉరుకులు పెట్టించడంలో ముఖ్య భూమిని పోషించారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ముఖ్య అనుచరుడిగా ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసిన ఆయనకు తగిన గుర్తింపు లభించాలని వడ్డెర కులస్తులు కోరుతున్నారు. ఆ గుర్తింపు కేవలం వడ్డెరలకే కాదని.. బడుగు బలహీవర్గాలవారందరకీ గౌరవంగా నిలుస్తుందని చెబుతున్నారు.

త్యాగస్ఫూర్తిని గుర్తు చేద్దాం : సీఎం

వడ్డె ఓబన్న జయంతిని పురస్కరించుకొని సీఎం చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆయన ధైర్య సాహసాలు, శౌర్యాన్ని గుర్తు చేసుకున్నారు. స్వాతంత్ర సమరయోధుడైన వడ్డె ఓబన్న తెల్లదొరల అణచివేతకు ఎదురొడ్డి పోరాటం సాగించారని సీఎం అన్నారు. రేనాటి వీరుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. ఓబన్న జయంతి సందర్భంగా ఆయన దేశభక్తి, త్యాగస్ఫూర్తిని భావితరాలకు గుర్తు చేద్దామని పిలుపునిచ్చారు.

నరసింహారెడ్డికి సైన్యానికి వెన్నుముకలా నిలిచారు : నారా లోకేశ్

స్వాతంత్ర్య సమరయోధులు, రేనాటి వీరుడు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆ మహనీయునికి రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) నివాళులు అర్పించారు. సిపాయిల తిరుగుబాటుకు ముందే బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన విప్లవ వీరుడు వడ్డే ఓబన్న అని కొనియాడారు. దేశం కోసం పోరాడిన తొలి స్వాతంత్ర్య సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యానికి వెన్నెముకలా నిలిచారన్నారు. ఆయన సాగించిన అలుపెరుగని పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకం అన్నారు. వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆ మహనీయుని త్యాగాలను స్మరించుకుందామని ప్రజలను కోరారు.

Next Story