వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సీఎం చంద్రబాబు ప్రసంగం

by Thanuru Gopichand |

ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయి.

వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సీఎం చంద్రబాబు ప్రసంగం
X

దిశ, వెబ్ డెస్క్ : దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో (WEF) పారిశ్రామికవేత్తలతో సీఐఐ (CII) బ్రేక్ ఫాస్ట్ సెషన్ ను నిర్వహించింది. సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీతో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) సెషన్ లో పాల్గొన్నారు. ఈ సమావేశానికి మాస్టర్ కార్డ్ సీఏఓ, కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ సహా విదేశీ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత్ కేంద్రంగా అభివృద్ధి-ఏపీ సానుకూలతలు అనే అంశం సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఇంధనం, డిజిటల్ ఇన్ ఫ్రాలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను హాజరైన వారికి వివరించారు. లాజిస్టిక్స్, తయారీ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులకు అవకాశం ఉందని తెలియజేశారు. ఏపీలో ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ప్రాధాన్యం ఇస్తోందని ప్రకటించారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పాదకతకు, టెక్నాలజీ రంగం అభివృద్దికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని వివరించారు. గతేడాది విశాఖపట్నం కేంద్రంగా సీఐఐ భాగస్వామ్య సదస్సు జరిగిందని.. అందులో ప్రపంచస్థాయి సంస్థలతో పెట్టుబడుల ఒప్పందం చేసుకున్నామని వెల్లడించారు. స్పేస్ సిటీ, పోర్టులు, ఎయిర్ పోర్టులు, హైవే కనెక్టివిటీ అంశాలపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం పెట్టుబడులను ఆకర్షించామని సీఎం అన్నారు. ప్రపంచ స్థాయిలో ఏపీకి గుర్తింపు ఉందని.. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల్లో తెలుగువారు కీలక స్థానాల్లో ఉన్నారని తెలియజేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని విస్తరించడమే కాకుండా తమ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు, అభివృద్ధికి దోహదపడాలని పిలుపునిచ్చారు.

Next Story