- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొక్కజొన్న రైతుల కోసం సీఎం కీలక అడుగు.. కేంద్రమంత్రికి చంద్రబాబు లేఖ

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని మొక్కజొన్న రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కీలక అడుగు వేశారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్‌కు ఆయన ఒక లేఖ రాశారు. రబీ సీజన్‌లో పండించిన మొక్కజొన్న పంటను వెంటనే కొనుగోలు చేయాలని, రైతులకు మద్దతు ధర దక్కేలా చూడాలని ఈ లేఖలో కోరారు.
ప్రస్తుతం మార్కెట్‌లో మొక్కజొన్న ధరలు రోజురోజుకూ పడిపోతుండటం పట్ల సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (MSP) క్వింటాల్‌కు రూ. 2,400 ఉండగా, బహిరంగ మార్కెట్‌లో కేవలం రూ. 1,600 నుంచి రూ. 1,700 మాత్రమే పలుకుతోందని ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ భారీ వ్యత్యాసం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వివరించారు.
రాష్ట్రంలో ఈ ఏడాది సుమారు 42.06 లక్షల టన్నుల మొక్కజొన్న దిగుబడి వచ్చే అవకాశం ఉందని, ఇందులో ఇంకా 14.26 లక్షల టన్నుల పంట కోత దశలో ఉందని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం సకాలంలో స్పందించి కొనుగోలు ప్రక్రియను ప్రారంభించకపోతే రైతులు కోలుకోలేని దెబ్బ తింటారని ఆయన పేర్కొన్నారు.
రైతులను ఆదుకోవడానికి 'పీఎం-ఆశా' (PM-AASHA) పథకం కింద నేరుగా ధరల వ్యత్యాస చెల్లింపులను వర్తింపజేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేక కేసుగా పరిగణించి, మద్దతు ధరలో వచ్చే వ్యత్యాసాన్ని వంద శాతం నిధుల రూపంలో కేంద్రమే భరించాలని కోరారు. అలాగే ఈ పథకాన్ని జూన్ 2026 వరకు పొడిగించి, నాఫెడ్, ఏపీ మార్క్‌ఫెడ్ సమన్వయంతో కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని చంద్రబాబు తన లేఖలో అభ్యర్థించారు.






