భక్తుల పట్ల ఎవరూ అగౌరవంగా ప్రవర్తించకూడదు : సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

by Ramesh Naini |

శ్రీశైలం మహాక్షేత్రంతో పాటు రాష్ట్రంలోని ప్రముఖ శివాలయాల్లో భక్తుల రద్దీ, సౌకర్యాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

భక్తుల పట్ల ఎవరూ అగౌరవంగా ప్రవర్తించకూడదు : సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: శ్రీశైలం మహాక్షేత్రంతో పాటు రాష్ట్రంలోని ప్రముఖ శివాలయాల్లో భక్తుల రద్దీ, సౌకర్యాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం, అక్కడి నుంచే మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. శ్రీశైలం బ్రహ్మోత్సవాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

భక్తుల పట్ల మర్యాదగా ఉండాలి!

మహాశివరాత్రి పర్వదినం దగ్గర పడుతుండటంతో శ్రీశైలంలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ముఖ్యంగా మాలధారణలు, దీక్షలతో ఎంతో కష్టపడి కాలినడకన వచ్చే భక్తుల పట్ల ఎవరూ అగౌరవంగా ప్రవర్తించకూడదని హితవు పలికారు. భక్తులకు త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పించడంతో పాటు, తాగునీరు, వసతి కల్పనలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని స్పష్టం చేశారు.

మంత్రులు, అధికారులకు దిశానిర్దేశం

దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, హోం మంత్రి అనిత ప్రత్యేక శ్రద్ధ వహించి ఏర్పాట్లను పర్యవేక్షించాలని సీఎం సూచించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు క్యూలైన్లలో ఇబ్బంది లేకుండా చూడాలి. అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేసేలా పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. రద్దీ దృష్ట్యా డీజీపీ నేతృత్వంలో పోలీస్ యంత్రాంగం పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని, శివరాత్రి వేడుకలు ఘనంగా, భక్తులకు సంతృప్తికరంగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.

Next Story