- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో చారిత్రాత్మక ఘట్టం.. పొట్టిశ్రీరాములు కాంస్యవిగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం
అమరావతిలోని శాఖమూరులో ఏర్పాటు చేసిన పొట్టిశ్రీరాములు 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఆవిష్కరించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం తన ప్రాణాలనే త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని, అమరావతిలోని శాఖమూరులో ఆయన 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘనంగా ఆవిష్కరించారు.
తొలి భారీ విగ్రహం.. అద్భుత నిర్మాణం
అమరావతి రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసిన తొలి భారీ విగ్రహంగా ఇది రికార్డు సృష్టించింది. శాఖమూరులో సుమారు 6.8 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ అమరజీవి స్మృతివనం ఏర్పాటు చేశారు. పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం కోసం 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్‌ను వినియోగించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, కేవలం 6 నెలల రికార్డు కాలంలోనే ప్రాజెక్టు మొదటి దశ పనులను పూర్తి చేయడం విశేషం.
రెండో దశలో మ్యూజియం, స్కిల్ సెంటర్
స్మృతివనం అభివృద్ధి కేవలం విగ్రహానికే పరిమితం కాకుండా, రెండో దశలో మరిన్ని వసతులు కల్పించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా.. అత్యాధునిక మ్యూజియం, ఆడిటోరియం, యువత కోసం స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను నిర్మించనున్నారు. అమరజీవి త్యాగాన్ని స్మరించుకుంటూ, భావితరాలకు ఆయన ఆశయాలను చాటిచెప్పేలా ఈ స్మృతివనాన్ని తీర్చిదిద్దినట్లు ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మబలిదానం వల్లే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, ఆయన గౌరవార్థం అమరావతిలో ఈ భారీ విగ్రహాన్ని ప్రతిష్టించడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని సీఎం చంద్రబాబు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్‌లతో పాటు బిజెపి నేత మాధవ్ పాల్గొన్నారు. అలాగే కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్, టీజీ భరత్, సవిత, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తదితర ప్రముఖులు ఈ ఆవిష్కరణలో పాలుపంచుకున్నారు.






