- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజధానిపై వైసీపీ విమర్శలను తిప్పికొట్టండి.. టీడీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబు పిలుపు
అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేయనున్న నేపథ్యంలో, ఈ విషయాన్ని సగర్వంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేయనున్న నేపథ్యంలో, ఈ విషయాన్ని సగర్వంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన అమరావతి నుంచి టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజధాని, సాగునీటి ప్రాజెక్టులు, పారిశ్రామికాభివృద్ధి, సంక్షేమం తదితర అంశాలపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు.
రాజధానిపై వైసీపీది మూడు ముక్కలాట
గత పాలకులు మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేశారని, దీనివల్ల పెట్టుబడిదారులు వెనుకంజ వేశారని సీఎం మండిపడ్డారు. రైతులు ఇచ్చిన భూముల్లోనే అమరావతిని నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. 2019లో టీడీపీ గెలిచి ఉంటే అమరావతి ఇప్పటికే ఆదర్శ నగరంగా మారేదన్నారు. రాజధానిపై వైసీపీ చేస్తున్న విమర్శలను దీటుగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాయలసీమ ఎత్తిపోతలపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎక్కడికక్కడ ఖండించాలన్నారు. ‘పూర్వోదయ’ పథకం ద్వారా రాయలసీమ రూపురేఖలు మారనున్నాయని తెలిపారు. నాడు వైసీపీ వ్యతిరేకించిన పట్టిసీమ ద్వారానే నేడు కృష్ణా డెల్టాకు నీరందుతోందని, మిగులు జలాలను రాయలసీమకు తరలిస్తున్నామని చెప్పారు. తుంగభద్ర గేట్ల మరమ్మతులు, శ్రీశైలం ప్లంజ్ పూల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.
సంక్షేమం - పార్టీ శ్రేణులకు హితవు
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం రూ.11,400 కోట్ల నిధులు ఇచ్చిందని గుర్తుచేశారు. నక్కపల్లిలో మిట్టల్ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేశామని, త్వరలోనే కడప స్టీల్‌ప్లాంట్ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. రాష్ట్రాన్ని ‘గ్రీన్ హైడ్రోజన్ హబ్’గా మార్చేందుకు అనేక ప్రాజెక్టులు తీసుకొస్తున్నట్లు తెలిపారు. రేపటి నుంచే చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.






