టోల్‌గేట్ సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే అనుచరుల దాడి.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

by Ramesh Naini |

అన్నమయ్య జిల్లాలోని గండబోయినపల్లె టోల్‌గేట్ వద్ద సిబ్బందిపై కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు, గన్‌మెన్ చేసిన దాడిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

టోల్‌గేట్ సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే అనుచరుల దాడి.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అన్నమయ్య జిల్లాలోని గండబోయినపల్లె టోల్‌గేట్ వద్ద సిబ్బందిపై కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు, గన్‌మెన్ చేసిన దాడిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. టోల్ గేట్ సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడిన ఎమ్మెల్యే అనుచరులపై తక్షణమే కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అసలేం జరిగిందంటే..?

టోల్ సిబ్బంది ఫిర్యాదు ప్రకారం.. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తన అనుచరులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో అన్నమయ్య జిల్లా, వాల్మీకిపురం మండల పరిధిలోని మదనపల్లె-తిరుపతి జాతీయ రహదారిపై ఉన్న గండబోయినపల్లె టోల్‌ప్లాజా వద్దకు వారి వాహనాలు చేరుకున్నాయి. నిబంధనల ప్రకారం టోల్‌ప్లాజా సిబ్బంది వారిని ఆపి టోల్ ఫీజు చెల్లించాలని కోరారు. దీంతో ‘ఎమ్మెల్యే వాహనాలనే ఆపుతారా? ఫీజు అడుగుతారా?’ అంటూ ఆయన అనుచరులతో పాటు గన్‌మెన్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సిబ్బందితో వాగ్వాదానికి దిగి రెచ్చిపోయారు. కారులో నుంచి కిందికి దిగిన గన్‌మెన్.. దౌర్జన్యంగా టోల్ బ్యారియర్‌ను ధ్వంసం చేశాడు. అంతటితో ఆగకుండా టోల్‌ప్లాజా మేనేజర్ రవి, మహిళా ఉద్యోగి శ్రీలతను తీవ్ర పదజాలంతో దూషించారు. ఆ గన్‌మెన్.. సదరు మహిళా ఉద్యోగి జుట్టు పట్టుకుని విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దారుణ ఘటన జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు అక్కడే వాహనంలోనే ఉండటం గమనార్హం. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి.

వెంటనే స్పందించిన సీఎం

ఈ ఘటనపై సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించారు. స్వపక్ష ఎమ్మెల్యే అనుచరులైనప్పటికీ దౌర్జన్యాలను సహించేది లేదని తేల్చి చెప్పారు. నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించారు. నిబంధనలు పాటించాల్సిన ప్రజాప్రతినిధుల అనుచరులే ఇలా బరితెగించడం పట్ల సీఎం సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

Next Story