అమరావతి క్వాంటం వ్యాలీకి భాగస్వామిగా క్యూపీఐఏఐ.. సీఎం చంద్రబాబు కీలక చర్చలు

by Naga Rani Yarlagadda |

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి క్వాంటం వ్యాలీ ప్రాజెక్టుకు కీలక మద్దతుగా క్యూపీఐఏఐ..

అమరావతి క్వాంటం వ్యాలీకి భాగస్వామిగా క్యూపీఐఏఐ.. సీఎం చంద్రబాబు కీలక చర్చలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి క్వాంటం వ్యాలీ (Amaravati Quantum Valley) ప్రాజెక్టుకు కీలక మద్దతుగా క్యూపీఐఏఐ (QPIAI) ముందుకు వచ్చింది. నేషనల్ క్వాంటం మిషన్‌ (National Quantum Mission)లో భాగంగా దేశంలో తొలిసారిగా అమరావతిలో ఏర్పాటు చేస్తున్న ఈ క్వాంటం వ్యాలీలో 8 క్యూబిట్‌ ఆధారిత అధునాతన క్వాంటం కంప్యూటర్‌ను ఏర్పాటుచేయడానికి క్యూపీఐఏఐ సంస్థ భాగస్వామిగా నిలవనుంది.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, క్యూపీఐఏఐ వ్యవస్థాపకుడు నాగేంద్ర నాగరాజన్‌తో భేటీ అయ్యారు. ఈ క్వాంటం సెంటర్‌ను విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్‌లకు ఉపయోకరంగా తీర్చిదిద్దాలని, ప్రజల అవసరాలను తీర్చే విధంగా వినియోగించాలనే దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. అమరావతిలో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.

విస్తృతంగా వినియోగానికి అవకాశాలు

అగ్రికల్చర్, వాటర్ మేనేజ్‌మెంట్, హెల్త్‌కేర్ తదితర రంగాల్లో క్వాంటం టెక్నాలజీ వినియోగం రాష్ట్రానికి మేలుకలిగించనున్నదని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. పంటల సాగు, తెగుళ్ల అంచనా, సమయానుకూల సలహాలు వంటి అంశాల్లో క్వాంటం కంప్యూటింగ్‌ కీలక పాత్ర పోషించనుంది. అలాగే.. నీటి వనరుల నిర్వహణ, వ్యాధుల నిర్ధారణ, మెడికల్ లాజిస్టిక్స్‌ వంటి రంగాల్లో క్వాంటం సిమ్యులేషన్‌ ఉపయోగపడే అవకాశాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. యువతకు అవసరమైన నైపుణ్యాలను అందించడంలో ఈ సాంకేతికత కీలకంగా నిలుస్తుందని పేర్కొంది.

డీప్ టెక్‌తో సమాజానికి ప్రయోజనం

విద్య, పరిశోధన, ఇన్నోవేషన్‌ రంగాల్లో డీప్ టెక్నాలజీని ప్రోత్సహిస్తూ సామాజిక, ఆర్థిక మార్పును తీసుకురావడమే అమరావతి క్వాంటం వ్యాలీ ప్రాజెక్టు లక్ష్యంగా పెట్టుకున్నదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. క్యూపీఐఏఐ, నేషనల్ క్వాంటం మిషన్‌ భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ముందడుగేస్తోంది.

Next Story