ఎమ్మెల్యే చదలవాడ వ్యవహారంపై సీఎం సీరియస్.. స్ట్రాంగ్ వార్నింగ్

by Naga Rani Yarlagadda |

నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు వ్యవహారంపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే చదలవాడ వ్యవహారంపై సీఎం సీరియస్.. స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు వ్యవహారంపై సీఎం చంద్రబాబు నాయుడు ఫైరయ్యారు. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేలా వ్యవహరించేవారెవరైనా సరే ఉపేక్షించబోమని, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని స్పష్టం చేశారు. క్రమశిక్షణను ఉల్లంఘిచింది ఎవరైనా ఇవే చర్యలుంటాయని తేల్చి చెప్పారు. కొందరు వ్యక్తుల వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని పణంగా పెట్టేందుకు సిద్ధంగా లేమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రవర్తించేవారిని ఇక భరించబోమన్నారు. రెండో ఆలోచన లేకుండా సస్పెండ్ చేసేస్తామని హెచ్చరించారు.

ఇటీవల పల్నాడు ఎస్పీ ఆఫీసులో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ సిహెచ్ అరవిందబాబు వ్యవహారం సీఎంకు కోపం తెప్పించింది. జిల్లా పోలీస్ సెల్ న్యాయ సలహాదారుగా తాను సూచించిన రామినేని ప్రసాద్ పేరును ఎందుకు ఆమోదించలేదంటూ ఎస్పీ కృష్ణారావుతో ఆయన వాగ్వాదానికి దిగారు. ఈ విషయంపై మార్చి 31 మంగళవారం నాడు ఎస్పీ ఆఫీసుకు వెళ్లిన ఎమ్మెల్యే.. 8 నెలల క్రితమే న్యాయసలహాదారు నియామకంపై లేఖ పంపితే.. దానిపై ఇంతా సంతకం ఎందుకు చేయలేదని నిలదీశారు. విచారణ తర్వాత సంతకం చేస్తానని ఎస్పీ చెప్పినా వినకుండా ఆర్డర్ కాపీ ఇచ్చేవరకూ వెళ్లేది లేదని బీష్మించుకుని కూర్చున్నారు. 10 గంటలపాటు అక్కడే ఉన్న ఎమ్మెల్యేకు మంత్రులు ఫోన్లు చేసినా స్పందించలేదని సమాచారం. దీంతో ఎమ్మెల్యే వ్యవహారం అధిష్ఠానం వరకూ వెళ్లగా.. ఆగ్రహం వ్యక్తం చేసింది.

Next Story