ముగిసిన చంద్రబాబు - పవన్ భేటీ : ఈ అంశాలపై సుదీర్ఘ చర్చ

by Naga Rani Yarlagadda |

సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయాలు, జల్ జీవన్ మిషన్ లపై చర్చించారు.

ముగిసిన చంద్రబాబు - పవన్ భేటీ : ఈ అంశాలపై సుదీర్ఘ చర్చ
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు కీలకంగా భేటీ అయ్యారు. మంగళగిరిలో హనుమాన్ ప్రాజెక్టు కార్యక్రమం పూర్తయిన వెంటనే పవన్ కల్యాణ్ ఉండవల్లిలో ఉన్న సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును కలిశారు. సుమారు 2 గంటలపాటు కొనసాగిన ఈ సమావేశంలో ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, జల్ జీవన్ మిషన్, డ్రెయిన్లు, రోడ్ల నిర్మాణం, వాటి నిర్వహణపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు జల్ జీవన్ మిషన్ ద్వారా సురక్షితమైన మంచినీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ను పక్కన పెట్టేసిందని అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని మళ్లీ గాడిలో పెట్టి.. అన్నిగ్రామాల్లో సురక్షితమైన తాగునీరు అందించాలని నిర్ణయించారు. ఇందులోభాగంగా రోజుకు 55 లీటర్ల తలసరి నీటిని కూటమి ప్రభుత్వం అందజేయనుంది.

అలాగే నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల ఎన్నికలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టీటీడీకి సంబంధించి ప్రస్తుతం నెలకొన్న వివాదాలపై ఇద్దరూ సుదీర్ఘంగా చర్చినట్లు సమాచారం. ఇక తన పరిధిలో ఉన్న శాఖల పురోగతి, ఎదురవుతున్న సవాళ్లను పవన్ కల్యాణ్ సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు తీసుకోవలసిన చర్యలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.

Next Story