రౌడీషీటర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసు: సీఐపై వేటు

by Naga Rani Yarlagadda |

విజయవాడలో రౌడీషీటర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

రౌడీషీటర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసు: సీఐపై వేటు
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలో రౌడీషీటర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన కొడుకు ఎక్కడున్నాడో చెప్పాలని పోలీసులను ఎంత వేడుకున్నా జాడ చెప్పడం లేదని, తన ఫోన్ ను లాక్కొని కొడుకు ఫొటోలన్నింటినీ డిలీట్ చేశారని సాయికృష్ణ తల్లి మీడియా ఎదుట బోరున విలపించింది. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో.. అతని తల్లిపట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని లాయర్లు, ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో.. విజయవాడ నగర సీపీ రాజశేఖర్ బాబు రంగంలోకి దిగారు. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటోన్న కృష్ణలంక సీఐ నాగరాజుపై వేటు పడింది. అతడిని వీఆర్ కు పంపుతూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణలంక కొత్త సీఐగా మురళీకృష్ణను నియమించారు.

కాగా.. ఈ ఏడాది మే10వ తేదీ నుంచి సాయికృష్ణ కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. సీఐ అతడిని మార్కాపురం నుంచి తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ మిస్సింగ్ కేసుపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టి.. ఈనెల 29న అతడిని కోర్టులో హాజరు పరచాలని పోలీసులను ఆదేశించింది. సాయికృష్ణను పోలీసులు కస్టడీలో ఉంచారా ? కుటుంబ సభ్యుల ఆరోపణలే నిజమా? అన్నది తేలాల్సి ఉంది.

Next Story