చిత్తూరులో విషాదం.. రెస్క్యూ టీం వచ్చేలోపే ప్రాణాలు కోల్పోయిన చిరుత

by Ramesh Naini |

నగర శివార్లలోని దొడ్డిపల్లి జగనన్న లేఔట్‌లో గత మూడు రోజులుగా సంచరిస్తూ, స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసిన చిరుతపులి చివరకు ప్రాణాలు కోల్పోయింది.

చిత్తూరులో విషాదం.. రెస్క్యూ టీం వచ్చేలోపే ప్రాణాలు కోల్పోయిన చిరుత
X

దిశ, డైనమిక్ బ్యూరో: నగర శివార్లలోని దొడ్డిపల్లి జగనన్న లేఔట్‌లో గత మూడు రోజులుగా సంచరిస్తూ, స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసిన చిరుతపులి చివరకు ప్రాణాలు కోల్పోయింది. ఆదివారం ముళ్లపొదల్లో తీవ్ర గాయాలతో స్పృహతప్పి పడి ఉన్న చిరుత.. అటవీశాఖ రెస్క్యూ బృందం చేరుకునేలోపే మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. గత కొద్ది రోజులుగా జనావాసాల మధ్య చిరుత సంచరిస్తుండటంతో దొడ్డిపల్లి పరిసర ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఇంటి నుంచి బయటకు రావడానికే భయపడ్డారు. ఈ క్రమంలో ఆదివారం నాడు ఓ ముళ్లపొదలో గాయాలపాలై, అపస్మారక స్థితిలో ఉన్న చిరుతను గమనించిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు.

హుటాహుటిన సంఘటనా స్థలానికి..

హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు పరిస్థితిని సమీక్షించారు. చిరుతను సురక్షితంగా తిరుపతిలోని ఎస్వీ జూ పార్కుకు తరలించి చికిత్స అందించేందుకు వీలుగా.. తిరుపతి రెస్క్యూ బృందానికి సమాచారం ఇచ్చారు. అయితే, ఆ ప్రత్యేక బృందం చేరుకునేలోపే సుమారు ఐదేళ్ల వయసున్న ఆ చిరుత తుదిశ్వాస విడిచింది. అనంతరం అధికారులు ముళ్లపొదల్లో నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. వేసవి కాలం కావడంతో నీరు, ఆహారం కోసం వెతుక్కుంటూనే చిరుత అటవీ ప్రాంతం (శేషాచలం అడవులు) దాటి జనావాసాల్లోకి వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. స్థానికులు ఈ ఘటనను కాస్త ముందుగా గుర్తించి ఉంటే చిరుత ప్రాణాలు కాపాడే అవకాశం ఉండేదని అధికారులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం చిరుతకు గాయాలు ఎలా అయ్యాయనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

Next Story