తిరుపతి జిల్లా | యూరియా కోసం క్యూకట్టిన రైతులు

by Thanuru Gopichand |

తిరుపతి జిల్లాలో అన్నదాతలకు యూరియా (Urea) కష్టాలు మరోసారి తలెత్తినట్లు కనిపిస్తున్నాయి.

తిరుపతి జిల్లా | యూరియా కోసం క్యూకట్టిన రైతులు
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుపతి జిల్లాలో అన్నదాతలకు యూరియా (Urea) కష్టాలు మరోసారి తలెత్తినట్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పాకాల మండలం కె.వడ్డెపల్లిలో యూరియా ఎరువుల కొరత తీవ్రంగా ఉన్నట్లు తెలియవస్తోంది. దీంతో రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి వేకువజాము నుంచే రైతు భరోసా కేంద్రం (RBK) వద్ద భారీ క్యూ కట్టారు. ఉదయం 5 గంటల నుంచే మహిళా రైతులు, వయోవృద్ధులు సైతం క్యూలో ఉంటున్నారు. ఎండను, ఇబ్బందులను లెక్కచేయకుండా బారులు తీరిన దృశ్యం క్షేత్రస్థాయిలో యూరియా డిమాండ్ ఎంత ఉందో తెలియజేస్తోందని పలువురు అంటున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో వరి, ఇతర వాణిజ్య పంటలకు యూరియా అవసరం అత్యంత కీలకం కావడం, సరైన సమయంలో ఎరువులు అందకపోతే దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. టోకెన్లను జారీ చేసినప్పటికీ యూరియా పంపిణీలో అధికారులు కావాలనే ఆలస్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అరకొరగా స్టాక్ అందుబాటులో ఉంచుతున్నారని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, సరిపడా యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నారు.

సరఫరా లోపాలు, కృత్రిమ కొరతపై అనుమానాలు!

​తిరుపతి జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో యూరియా సరఫరాలో లోపాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఎరువుల కొరత లేదని అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్ర స్థాయిలో రైతు భరోసా కేంద్రాలు, సహకార సంఘాల వద్ద యూరియా నిల్వలు అరకొరగా ఉండడం, పంపిణీలో జాప్యం జరగడం రైతుల ఆగ్రహానికి కారణమవుతోంది. ఖరీఫ్ సీజన్‌లో యూరియా వినియోగం గణనీయంగా పెరగడం ఒక కారణమైతే, డీలర్లు వ్యవసాయేతర అవసరాలకు యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలించడం కూడా కొరతకు దారితీస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కృత్రిమ కొరత కారణంగా ప్రైవేటు దుకాణాల్లో యూరియా అధిక ధరలకు అమ్ముడవుతోందని రైతులు వాపోతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం, వ్యవసాయ శాఖ మంత్రి సైతం యూరియా సరఫరాపై సమీక్షలు జరిపాయి. జిల్లాల కలెక్టర్లకు పంపిణీని పర్యవేక్షించాలని, బ్లాక్ మార్కెట్‌కు తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినప్పటికీ తిరుపతి వంటి జిల్లాల్లో సమస్య ఇంకా పరిష్కారం కాలేదనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కేంద్రం నుంచి యూరియా కోటాను విడుదల చేయించుకుని, రైతు భరోసా కేంద్రాల ద్వారా పారదర్శకంగా పంపిణీ చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రైతులు అంటున్నారు. అందుకోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.

Next Story