- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tirupati | రేపు పద్మావతి అమ్మవారికి చక్రస్నానం
కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుచానూరు (Tiruchanur) పద్మావతి అమ్మవారికి రేపు (నవంబర్ 25) పంచమితీర్థం (చక్రస్నానం) నిర్వహించనున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుచానూరు (Tiruchanur) పద్మావతి అమ్మవారికి రేపు (నవంబర్ 25) పంచమితీర్థం (చక్రస్నానం) నిర్వహించనున్నారు. అమ్మవారు పద్మ పుష్కరిణిలో ఆవిర్భవించిన తిథిని పంచమితీర్థంగా (Panchami Teertham) వ్యవహరిస్తారు. బ్రహ్మోత్సవాల చివరి రోజైన మంగళవారం కుంభ లగ్నం మధ్యాహ్నం 12.10 గంటల నుంచి 12.20 గంటల వరకు పంచమితీర్థ మహోత్సవం జరుగుతుందని అధికారులు తెలిపారు. పంచమితీర్థం రోజున ఉదయం ధ్వజారోహణ మండపంలో చూర్ణాభిషేకం నిర్వహిస్తారన్నారు. అమ్మవారి పుట్టినరోజు కావడంతో అభ్యంగన స్నానం చేయిస్తారన్నారు. అమ్మవారి ఉత్సవమూర్తికి నువ్వుల నూనె, చూర్ణపొడి కలిపి ఈ క్రతువు నిర్వహిస్తారని పేర్కొన్నారు. అమ్మవారిని ఆవాహన చేసి శ్రీ మంత్రం శ్రీ సూక్తం పఠిస్తారని వివరించారు. అభ్యంగన స్నానం అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని పంచమితీర్థ మండపానికి వేంచేపు చేస్తారన్నారు.
పంచమితీర్థ మండపంలో
పంచమితీర్థ మండపంలో వేదికపై పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌ను ఆశీనులను చేస్తారని అధికారులు తెలిపారు. 9 కలశాల్లో ఆవాహన చేసి అనుజ్ఞ స్వీకరిస్తారన్నారు. విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ఉపచారాలు సమర్పిస్తారని, ఈ సమయంలోనే తిరుమల శ్రీవారి ఆలయం నుంచి వచ్చిన సారె, పసుపు కుంకుమ, చందనం, స్వామివారికి అలంకరించిన వస్త్రాలు, దివ్యమాలలు, దివ్య ఆభరణాలు, లడ్డూ, వడ, అప్పం తదితర ప్రసాదాలను అమ్మవారికి సమర్పిస్తారని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి వచ్చిన సారె ముందుగా తిరుపతిలోని శ్రీకోదండరామాలయం, శ్రీగోవిందరాజస్వామివారి ఆలయాల మర్యాదలు స్వీకరించి తిరుచానూరులోని పసుపు మండపం వద్దకు చేరుకుంటుందన్నారు. అక్కడ తిరుచానూరు అమ్మవారి ఆలయ అధికారులు స్వాగతం పలికి మేళతాళాల మధ్య ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకెళతారన్నారు.
శ్రీరామస్థూపం
తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం వద్ద గల పుష్కరిణి ఒడ్డున శ్రీరామస్థూపం ఉందని అధికారులు తెలియజేశారు. 1970వ దశకంలో శ్రీమన్నారాయణ రామానుజ జీయర్(పెద్దజీయర్) స్వామి ఇక్కడ శ్రీరామస్థూపాన్ని నిర్మించారన్నారు. ఆ సమయంలో రామహోమాదులు చేస్తూ 27 రోజులు రామాయణ పారాయణం, హవనం నిర్వహించారని వివరించారు. అనంతరం శ్రీరామస్థూపంలో శ్రీరామకోటి పుస్తకాలను ఉంచి ప్రతిష్ఠ చేశారన్నారని తెలిపారు.






