చిత్తూరులో విజృంభిస్తోన్న 'స్క్రబ్ టైఫస్': 380కి పైగా కేసులు నమోదు!

by Thanuru Gopichand |

​చిత్తూరు (Chittoor) జిల్లాలో స్క్రబ్ టైఫస్ (Scrub Typhus) కేసులు అసాధారణ రీతిలో పెరగడం ప్రజల్లో తీవ్ర భయాందోళనను రేకెత్తిస్తోంది.

చిత్తూరులో విజృంభిస్తోన్న స్క్రబ్ టైఫస్: 380కి పైగా కేసులు నమోదు!
X

దిశ, వెబ్ డెస్క్ : ​చిత్తూరు (Chittoor) జిల్లాలో స్క్రబ్ టైఫస్ (Scrub Typhus) కేసులు అసాధారణ రీతిలో పెరగడం ప్రజల్లో తీవ్ర భయాందోళనను రేకెత్తిస్తోంది. గత ఏడు నెలలుగా జిల్లా వ్యాప్తంగా ఈ వ్యాధి కేసులు నమోదవుతుండగా, ఇప్పటివరకు 380కి పైగా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో చిత్తూరులోనే అత్యధికంగా కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ వ్యాధి సోకిన చాలా మంది రోగులు స్థానిక ఆసుపత్రుల్లో సరైన పరీక్షా సౌకర్యాలు, వైద్యం అందుబాటులో లేకపోవడంతో చికిత్స కోసం పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలలోని ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని తెలుస్తోంది. సరైన సమయంలో వ్యాధిని గుర్తించకపోవడం, చికిత్స ఆలస్యం కావడం వల్ల పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని వైద్య నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్ర్కబ్ టైఫస్ నివారణకు చర్యలను ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా నివారణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అంటువ్యాధి కాకపోయినప్పటికీ ప్రాణాంతకంగా ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

స్క్రబ్ టైఫస్ లక్షణాలు ఏంటి

​స్క్రబ్ టైఫస్ అనేది ఓరియెంటియా సుత్సుగాముషి అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే ఒక రకమైన తీవ్రమైన జ్వరంగా వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది నల్లిని పోలిన చిన్న కీటకాలు (లార్వల్ మైట్స్/చిగ్గర్స్) కాటు వేయడం ద్వారా మనుషులకు వ్యాపిస్తుందంటున్నారు. ఈ కీటకాలు ముఖ్యంగా పొలాలు, పొదలు, తడి నేలలు, చెత్తాచెదారం ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయని పేర్కొంటున్నారు. వ్యాధి సోకిన వారిలో ప్రధానంగా అధిక జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, కీటకం కుట్టిన చోట నల్లటి పుండు ('ఎస్కార్' ) ఏర్పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు. కొందరిలో దద్దుర్లు, దగ్గు, జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయంటున్నారు. ఈ లక్షణాలు సాధారణ జ్వరాల మాదిరిగానే ఉండటం వలన చాలా మంది మొదట మలేరియా, టైఫాయిడ్‌గా పొరబడి చికిత్సలో జాప్యం చేస్తున్నారని తెలియజేస్తున్నారు.

వైద్యుల సూచనలు

స్క్రబ్ టైఫస్ వ్యాధిని ​సరైన సమయంలో గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తద్వారా యాంటీబయాటిక్స్ (ముఖ్యంగా డోక్సీసైక్లిన్, అజిత్రోమైసిన్) తో చికిత్స ప్రారంభిస్తే స్క్రబ్ టైఫస్ పూర్తిగా నయమవుతుందని వైద్యులు భరోసా ఇస్తున్నారు. అయితే చికిత్సలో ఆలస్యం జరిగితే ఇది శ్వాసకోశ ఇబ్బందులు, మెదడు ఇన్‌ఫెక్షన్లు, కిడ్నీ వైఫల్యం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీసి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలంలో దీని ప్రభావం అధికంగా ఉంటుందంటున్నారు. ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, పొదలు, పొలాల్లో పనిచేసేటప్పుడు, ఆడేటప్పుడు శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు. కీటకాలు కుట్టకుండా రక్షణ కల్పించే లోషన్లను వాడటం వంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్దేశిస్తున్నారు. ఎవరికైనా మూడు రోజులకు పైగా జ్వరం, తలనొప్పి, శరీరంలో నల్లటి మచ్చలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story