శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో కఠిన ఆంక్షలు

by Bhoopathi Nagaiah |

శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక దర్శనాలను ఉచితంగా చేయిస్తున్న ఆలయ సిబ్బందిపై ఈవో సీరియస్ అయ్యారు.

శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో కఠిన ఆంక్షలు
X

దిశ, శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక దర్శనాలను ఉచితంగా చేయిస్తున్న ఆలయ సిబ్బందిపై ఈవో సీరియస్ అయ్యారు. టికెట్లు లేకుండా, అక్రమంగా ఏ ఒక్క భక్తుడు లోపలికి వెళ్లిన అందుకు బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో బీకే వెంకటేశులు హెచ్చరించారు. సోమవారం ఆయన పీఆర్ఓ కార్యాలయం సిబ్బంది, ఎస్పీఎఫ్, హోమ్ గార్డులు, సెక్యూరిటీతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులను పీఆర్ఓ కార్యాలయం సిబ్బంది టికెట్లు లేకుండా ప్రత్యేక దర్శనాలకు తీసుకెళ్తున్నారనే ఆరోపణలపై స్పందించారు. రూ.200, రూ.500ల ప్రత్యేక దర్శనం క్యూ లైన్లో వెళ్లేవారు తప్పనిసరిగా టికెట్లు కొనాల్సిందేనని స్పష్టం చేశారు. టికెట్లు లేకుండా ప్రత్యేక దర్శనాలకు ఏ ఒక్కరిని తీసుకెళ్లకూడదని ఆదేశించారు. అక్రమంగా, ఉచితంగా దర్శనాలకు తీసుకెళ్లే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో హెచ్చరించారు.

ప్రధాన ద్వారమైన కంచు గడపల వద్ద విధి నిర్వహణ ఉండే ఎస్పీఎఫ్, హోంగార్డులను, సెక్యూరిటీ సిబ్బందిని తరచూ మార్పు చేయాలని అధికారులను ఆదేశించారు. కంచు గడపల వద్ద కొందరు సిబ్బంది మాత్రమే ఉండడం వల్ల అక్రమాలు జరుగుతున్నాయని, ఇకపై అలా జరగడానికి వీలు లేదని ఈవో హుకుం జారీ చేశారు. టికెట్లు లేకుండా వెళ్లే వారిని గుర్తించి వెనుకకు పంపాలని, సిబ్బంది ఉంటే వారిపై ఫిర్యాదు చేయాలని ఇవో అధికారులకు సూచించారు. ఇకపై ఆలయంలో ఎవరు నిబంధనలను అతిక్రమించినా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. ఆలయంలో విధులు నిర్వహించే ప్రతి ఒక్కరూ అలెర్ట్‌గా ఉండాలన్నారు.

Next Story