వైయస్ జగన్ కు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

by Thanuru Gopichand |   (  Updated:2025-12-21 07:40:09  IST  )

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) మాజీ సీఎం వైయస్ జగన్ కు జన్మదిన శుభాకాంక్షలను (Birth Day Wishes) తెలియజేశారు.

వైయస్ జగన్ కు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) మాజీ సీఎం వైయస్ జగన్ కు జన్మదిన శుభాకాంక్షలను (Birth Day Wishes) తెలియజేశారు. జగన్ కు శుభాకాంక్షలను తెలియజేస్తే ఎక్స్ వేదికగా తన ఖాతాలో పోస్ట్ చేశారు. వైయస్ జగన్ (YS Jagan) దీర్ఘ ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు. ప్రతిపక్ష నేతలకు కూడా వ్యక్తిగత స్పేస్ లో గౌరవం ఇవ్వడం సీఎం చంద్రబాబు మంచితనానికి అద్దం పడుతోందని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. మాటల్లో మంటలు కురిపించినా, మనసులో కల్మశం ఉండకూడదనే సందేశాన్ని సీఎం ఇచ్చారని చెబుతున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి స్నేహితులైన సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో కూడా వైయస్ఆర్ కు సమవుజ్జీవులు. ఇద్దరూ రాజకీయ వేదికపై బలమైన ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ ఎన్నడూ వ్యక్తిగత బేషజాలకు పోయిన దాఖలాలు లేవు. వేదికలపై మాటల మంటలు పుట్టించినప్పటికీ వ్యక్తిగతంగా మాత్రం రాష్ట్ర అభివృద్ధి కోసం ఒకే మాటపై ఉండేవారని రాజకీయ వర్గాలవారు అంటున్నారు.

రాష్ట్రంలో ఆరోగ్యకరమైన రాజకీయ వాతావరణం సృష్టించే ప్రయత్నంలో భాగంగా తొలుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో శుభాకాంక్షలు తెలియజేయించారని.. తరువాత వీలు చూసుకొని తనే స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రాభివృద్ధి విషయంలో కలిసి రావాలని సీఎం పలు వేదికలపై వైసీపీకి పిలుపునిచ్చారు. రాష్ట్ర సంక్షేమం, ప్రగతిలో భాగస్వాములు కావాలని వివిధ సందర్భాల్లో కోరారు. ఏపీకి పెట్టుబడులు కూడా వస్తున్న నేపథ్యంలో.. అందరినీ కలుపుకొని వెళ్లే ఆలోచనలో సీఎం ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలోనే అటు వైపుగా మరో ముందడుగు వేశారని చెబుతున్నారు. అందులో భాగంగానే మాజీ సీఎం జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి లౌక్యం ప్రదర్శించారని చెప్పుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ సీఎం శుభాకాంక్షలు తెలియజేయడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కూడా వైయస్ జగన్ కు జన్మదిన శుభాకాంక్షలను ఎక్స్ వేదికగా తెలియజేశారు. మంచి ఆరోగ్యం, దీర్షాయువు ఉండాలని ఆకాంక్షించారు.

Next Story