భారతి సిమెంట్స్ మేనేజర్‌పై చీటింగ్ కేసు నమోదు

by Naga Rani Yarlagadda |

కడప జిల్లాలో ఓ భూ కుంభకోణం కేసులో భారతి సిమెంట్స్ మేనేజర్ భార్గవ్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

భారతి సిమెంట్స్ మేనేజర్‌పై చీటింగ్ కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లాలో ఓ భూ కుంభకోణం కేసులో భారతి సిమెంట్స్ మేనేజర్ భార్గవ్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భూమి ఇప్పిస్తానని చెప్పి నమ్మించి రూ.60 లక్షలు అడ్వాన్స్ గా తీసుకుని మోసం చేసినట్లు భార్గవ్ రెడ్డిపై బాధితుడు మహబూబ్ ఖాన్ ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చేయాలని కోరుతూ కోర్టు మెట్లెక్కాడు. దీంతో కోర్టు విచారణ జరిపి.. భార్గవ్ రెడ్డిపై కేసు నమోదు చేయాల్సిందిగా సీకే దిన్నె పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

సీకే దిన్నె మండలం మామిళ్లపల్లె రెవెన్యూ గ్రామంలో రూ.10 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.3 కోట్లకే ఇప్పిస్తామని కొందరు వ్యక్తులు కడపకు చెందిన మహబూబ్ ఖాన్ కు మాయమాటలు చెప్పి నమ్మబలికారు. వారి మాటలు నిజమేనని నమ్మిన మహబూబా ఖాన్.. అగ్రిమెంట్ రాయించుకుని రూ.60 లక్షలు అడ్వాన్స్ గా చెల్లించారు. కానీ.. అడ్వాన్స్ తీసుకున్నాక భూమిని చూపించకుండా మాట దాటవేయడంతో పాటు తప్పించుకు తిరగడంతో ఖాన్ కు అనుమానం కలిగింది. అసలు భూమి ఉందా లేదా అని ఆరా తీయగా.. ఆ భూమి వేరే వ్యక్తుల పేరుపై ఉన్నట్లు తేలింది. మోసపోయినట్లు గ్రహించిన ఆయన.. న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయమూర్తి.. నెలరోజుల్లో నిందితులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story