AP:ఫ్యాన్‌కి ఓటేస్తే మీ మెడకు ఉరేసినట్లే..చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
AP:ఫ్యాన్‌కి ఓటేస్తే మీ మెడకు ఉరేసినట్లే..చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
X

దిశ ప్రతినిధి,ఉండి:ఫ్యాన్‌కు ఓటేస్తే మీ మెడకు ఉరేసినట్లేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో శుక్రవారం జరిగిన ప్రజాగళం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలనేదే మూడు జెండాల అజెండా అన్నారు. అరాచకానికి వైసీపీ ప్రభుత్వం పరాకాష్ట రాష్ట్రాన్ని ఒక అహంకారి, సైకో, విధ్వంసకారుడు, దోపిడీదారుడు పాలన చేస్తున్నారని మండిపడ్డారు. “ఎన్నికలు ఇక మూడు రోజులే పోలింగ్ స్టేషన్లు దద్దరిల్లి పోవాలి. ఎండ ఉందని ఇంట్లో పడుకుంటే మీ ఇంటికి గొడ్డలి వస్తుంది. రూ.10 ఇచ్చి రూ.100 ప్రజల నుంచి లాక్కుంటున్నారు.

ప్రజల ఆస్థులను కొల్లగొట్టి రూ.1000 దోచుకున్న బందిపోటు జగన్. రూ.60 క్వార్టర్ బాటిల్ రూ.200 పెరిగింది. అన్ని జగ్గూభాయ్ బ్రాండ్లే. ఒక క్వార్టర్ తాగితే కిక్కు రాదు, రెండో క్వార్టర్ తాగితే కడుపులో మంట పెరుగుతుందని హేళన చేశారు. అన్ని కుంభకోణాలకు పాల్పడుతున్నారు. మట్టి, భూమి, భూగర్భ ఖనిజ సంపద, ఆస్తులు కొట్టేసిన వ్యక్తి జలగ జగన్ అని ఎద్దేవా చేశారు. మీ భూమి మీద? పట్టాదారు పాసుపుస్తకం మీద ఉండాల్సింది ప్రభుత్వ రాజముద్ర అన్నారు. కానీ దీని మీద జగన్ ఫోటో ఎందుకు ఉంది? అంటే జగన్ రెడ్డి నా అంటే నాశనం చేస్తారనే అర్ధం. నా ఎస్సీ లంటూ దళితులను చంపి డోర్ డెలివరి చేశారు.

నా బీసీ అంటే స్కీములను రద్దు చేశారు. మీ బిడ్డ అంటూనే మీ భూములు కాజేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టాదారు పాసుపుస్తకం మీద జగన్ బొమ్మ తీసేసి ప్రభుత్వ రాజముద్ర వేయిస్తాను. ఎన్నికల్లో ఫ్యాన్ తిరిగితే ప్రజల భూములు గోవిందా గోవిందా? మీ మెడకు ఉరి వెయ్యాలని జగన్ ఆలోచించారు. కానీ ప్రజలు ఫ్యాన్ కి ఉరి వేయాలి అన్నారు. మీ భూమి మీది కావాలంటే కూటమి అధికారంలోకి రావాలి. మొదటి సంతకం డీఎస్సీ, రెండో సంతకం జగన్ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తాను. ఈ చట్టాన్ని ఈ రోజు సాయంత్రం మీ ఊర్లో కాల్చేయండి. రాష్ట్రంలో దొంగలు పడ్డారు. ఏదైనా ప్రశ్నిస్తే గొడ్డలి పంపిస్తారు, పోలీస్ స్టేషన్లో టార్చర్ పెడతారని చంద్రబాబు అన్నారు. సభలో అసెంబ్లీ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణంరాజు, సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story