దేవాలయాల సందర్శనకు చంద్రబాబు: రెండు రోజులు తిరుపతిలోనే మకాం

by Disha Web Desk 21 |
దేవాలయాల సందర్శనకు చంద్రబాబు: రెండు రోజులు తిరుపతిలోనే మకాం
X

దిశ , డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు దేవాలయాల సందర్శనకు శ్రీకారం చుట్టారు. ఇటీవలే చంద్రబాబు నాయుడును వరుస వివాదాలు చుట్టుముట్టాయి. ముఖ్యంగా సీఐడీ కేసులపై కేసులు పెడుతోంది. అంతేకాదు స్కిల్ స్కాం కేసులో ఏకంగా 52 రోజులుగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో రెగ్యులర్ బెయిల్ మంజూరు అయ్యింది. అంతేకాదు న్యాయస్థానాల్లో కూడా చంద్రబాబుకు ఊరటలభిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు దేవాలయాల సందర్శనకు శ్రీకారం చుట్టారు. దేవదేవుళ్ల ఆశీస్సులు తీసుకుని ఇక రాజకీయ కార్యక్రమాల్లో దూకుడు పెంచాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకోనున్నారు. అనంతరం ప్రముఖ దేవాలయాలను చంద్రబాబు నాయుడు దర్శించుకోనున్నారు.


రాత్రికి తిరుపతిలోనే బస

దేవాలయాల సందర్శనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుపతికి బయలుదేరారు. హైదరాబాద్ నుంచి నేరుగా తిరుపతి పర్యటనకు చంద్రబాబు బయలుదేరారు. గురువారం సాయంత్రం చంద్రబాబు నాయుడు తిరుమలలోనే బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నాం చంద్రబాబు నాయుడు అమరావతి చేరుకుంటారు. మరుసటి రోజు డిసెంబర్ 2న విజయవాడ కనకదుర్గమ్మను చంద్రబాబు కుటుంబ సమేతంగా దర్శించుకుని మెుక్కులు చెల్లించుకుంటారు. ఇకపోతే డిసెంబర్ 3న విశాఖ వెళ్లనున్నారు. అదేరోజు సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 5న శ్రీశైలం మల్లన్నను చంద్రబాబు కుటుంబం దర్శించుకోనుంది. ఈ మేరకు టీడీపీ కార్యాలయం షెడ్యూల్ విడుదల చేసింది.

Next Story

Most Viewed