‘చంద్రబాబు’ ఓ కర్మయోగి.. యోగా డే వేడుకల్లో బాబా రాందేవ్‌

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-21 02:15:38  IST  )

విజయవాడలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను వైభవోపేతంగా నిర్వహించారు.

‘చంద్రబాబు’ ఓ కర్మయోగి.. యోగా డే వేడుకల్లో బాబా రాందేవ్‌
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ వేదికగా విజయవాడలో యోగా వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రముఖ యోగా గురు, పతంజలి సంస్థల అధినేత బాబా రాందేవ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ సామూహిక యోగాసనాల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్నారు. ఈ ప్రతిష్టాత్మక వేడుకల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్‌వర్మ, ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తో పాటు పలువురు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, వేలాది మంది యోగా సాధకులు పాల్గొన్నారు. బాబా రాందేవ్‌ నేతృత్వంలో సీఎం చంద్రబాబు, లోకేష్, కేంద్ర మంత్రులు ఉత్సాహంగా యోగాసనాలు, ప్రాణాయామం చేశారు.

ఈ సందర్భంగా యోగా గురు బాబా రాందేవ్‌ వేదికపై మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడిపై ప్రశంసల జల్లు కురిపించారు. చంద్రబాబు రాజకీయాల్లోనే కాకుండా నిజజీవితంలోనూ అత్యంత క్రమశిక్షణ కలిగిన నాయకుడని కొనియాడారు. చంద్రబాబు ఓ కర్మయోగ (Karma Yogi)ని, ఆయన ఎప్పడూ ప్రజల శ్రేయస్సు కోసమే ఆలోచిస్తారని తెలిపారు. సమాజం కోసం నిరంతరం శ్రమించే దూరదృష్టి (Visionary) కలిగిన గొప్ప నాయకుడని తెలిపారు. బాబు పాలనా దక్షత, విజన్ అంటే నాకు ఎంతో గౌరవమని పేర్కొన్నారు. 70 ఏళ్లు దాటినా అయనది అదే ఫిట్‌నెస్, ఎనర్జీతో పనిచేయడం వెనుక క్రమశిక్షణతో కూడిన జీవనశైలే కారణమని బాబా రాందేవ్ ప్రశంసించారు.

Next Story