- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నిబంధనలు అతిక్రమిస్తామంటే కుదరదు’.. ఏపీ ఉత్తర్వులపై కేంద్రం అభ్యంతరం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల కోసం డీజిల్ సరఫరా చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై కేంద్ర ప్రభుత్వం కీలక స్పందన ఇచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల కోసం డీజిల్ సరఫరా చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై కేంద్ర ప్రభుత్వం కీలక స్పందన ఇచ్చింది. రిటైల్ బంకుల ద్వారా డీజిల్ సరఫరా చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను తోసిపుచ్చుతూ కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజధాని పనుల కోసం భారీ మొత్తంలో డీజిల్ అవసరమైన నేపథ్యంలో, స్థానిక రిటైల్ ఔట్‌లెట్‌ల (పెట్రోల్ బంకుల) నుంచి బల్క్‌గా (మొత్తంగా) సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. రిటైల్ బంకుల నుండి భారీగా ఇంధనాన్ని తరలించడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్రం ఆదేశించింది. భారీ అవసరాల కోసం రిటైల్ బంకులపై ఆధారపడకుండా, నేరుగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (OMCs) నుంచే బల్క్ రేటుకు కొనుగోలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది.
కారణమేంటి..?
సాధారణంగా రిటైల్ బంకులు సామాన్య ప్రజల వాహనాల అవసరాల కోసం ఉంటాయి. అక్కడ నుండి భారీ యంత్రాలకు లేదా ప్రాజెక్టుల కోసం వేల లీటర్ల డీజిల్‌ను తరలించడం వల్ల స్థానికంగా కొరత ఏర్పడటమే కాకుండా, భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని కేంద్రం పేర్కొంది. అలాగే, రిటైల్ ధరకు, బల్క్ ధరకు మధ్య వ్యత్యాసం ఉండటం కూడా ఒక కారణంగా తెలుస్తోంది. కేంద్రం తాజా నిర్ణయంతో ఏపీ ప్రభుత్వం ఇప్పుడు రాజధాని పనుల నిమిత్తం నేరుగా చమురు కంపెనీలతో ఒప్పందం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.






