రాజధాని ప్రాంతంలో విషాదం.. ప్రకృతి ప్రకోపానికి గేదెల కాపరి బలి

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-22 08:42:38  IST  )

అమరావతి ప్రకృతి ప్రకోపానికి గేదెల కాపరి బలైపోయారు. పల్నాడు జిల్లా అమరావతి మండలం ఎండ్రాయిలో పిడుగుపాటు ఘటనలో నల్లగొర్ల విజయ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు...

రాజధాని ప్రాంతంలో విషాదం.. ప్రకృతి ప్రకోపానికి గేదెల కాపరి బలి
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravathi) ప్రకృతి ప్రకోపానికి గేదెల కాపరి బలైపోయారు. పల్నాడు జిల్లా అమరావతి మండలం ఎండ్రాయి(Endrai)లో పిడుగుపాటు(Thunder Strom) ఘటనలో నల్లగొర్ల విజయ్ కుమార్ (30) అక్కడికక్కడే మృతి చెందారు. ఉదయం నుంచి సాధారణంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఈ ఘోరం జరిగిందని స్థానికులు తెలిపారు.

ప్రతిరోజూ లాగే..

రోజూ మాదిరిగానే గ్రామ సమీపంలోని పొలాల్లో గేదెల మందను మేపడానికి కాపరి విజయ్ కుమార్ వెళ్లారు. అయితే మధ్యాహ్నం వరకు అక్కడే ఉన్నారు. ఆ సమయంలో ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. సురక్షిత ప్రాంతానికి చేరుకునే లోపే పెద్ద శబ్దంతో విజయ్ కుమార్‌పై పిడుగు పడింది. ఈ ధాటికి ఆయన శరీరం కాలిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

అకాల మరణం చెందడంతో..

సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కష్ట పడి పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే వ్యక్తి ఇలా అకాల మరణం చెందడంతో ఎండ్రాయి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండవద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని గ్రామ ప్రజలకు అధికారులు సూచించారు.

Next Story