ముద్రగడకు బుద్ధా వెంకన్న కౌంటర్.. బహిరంగ లేఖ

by Thanuru Gopichand |

ఎంత అసూయ పడితే చంద్రబాబు నాయుడు అంత ఎదుగుతారని బుద్ధా వెంకన్న అన్నారు.

ముద్రగడకు బుద్ధా వెంకన్న కౌంటర్.. బహిరంగ లేఖ
X

దిశ, వెబ్ డెస్క్ : కాపు ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన ముద్రగడ పద్మనాభ రెడ్డి (Mudragada Padmanabha Reddy) సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ కు రాసిన బహిరంగ లేఖపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న (Buddha Venkanna) కౌంటర్ ఇచ్చారు. పలు ప్రశ్నలను సంధిస్తూ బహిరంగ లేఖను రాశారు. గతంలో తనపై ఇప్పుడు అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వం దాడి చేస్తోందని.. టీడీపీకి అండగా నిలిచిన కాపు సామాజికవర్గంపైనే దాడులు జరుగుతున్నాయని ముద్రగడ ఆరోపించారు. రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతోందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చెప్పి ఎమర్జెన్సీ విధిస్తే ప్రతిపక్షాలను పాలనా కాలం పూర్తయ్యే వరకు జైలులో ఉంచొచ్చని విమర్శించారు. దీనిపై మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఘాటుగా స్పందిస్తూ ముద్రగడపై ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. దమ్ముంటే తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని సవాలు విసిరారు.

అప్పుడు కులం గుర్తు రాలేదా?

సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ కు ముద్రగడ్డ పద్మనాభ రెడ్డి రాసిన లేఖను తాను కూడా చూశానని వెంకన్న అన్నారు. ఆయన తండ్రి చెప్పిన మాటలను కూడా ప్రస్తావించడం పట్ల సీరియస్ అయ్యారు. అవసరం ఉన్నప్పుడే కులం గురించి మాట్లాడమని మీ తండ్రి చెప్పారా అని ముద్రగడను ప్రశ్నించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తల్లిని, భార్యని విమర్శించినప్పుడు కులం గుర్తుకు రాలేదా అని నిలదీశారు.

మంత్రి నారాయణ కాపు కాదా?

గతంలో మంత్రి పొంగూరు నారాయణపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని. ఆయనను హైదరాబాద్ నుంచి చిత్తూరుకు తీసుకెళ్లారని ముద్రగడకు గుర్తు చేశారు. ఆ సమయంలో ఆయన కాపు సామాజికవర్గానికి చెందినవారు కాదా? ఆ విషయం గుర్తు రాలేదనని అడిగారు. కిర్లంపూడిలో గవర సామాజికవర్గం అండగా నిలిచిందని చెప్పేవారు కదా.. అదే సామాజికవర్గానికి చెందిన తనను మాచర్లలో చంపడానికి యత్నించినప్పుడు తప్పనిపించలేదా అని ప్రశ్నించారు.

ఆ మాట నిజం కాదా?

ముద్రగడ పద్మనాభ రెడ్డి 1994లో ఎమ్మెల్యేగా ఓడిపోయి ఇంట్లో కూర్చునప్పుడు.. 1999లో సీఎం చంద్రబాబు నాయుడు ఎంపీ టిక్కెట్ ఇచ్చి పార్లమెంట్ పంపించారు. అప్పుడు ఆయన గొప్ప వ్యక్తి అని పొగిని విషయం నిజం కాదా అని ప్రశ్నించారు.

ఆ రోజు లేఖ ఎందుకు రాయలేదు?

అసెంబ్లీ లోపల, బయట సీఎం చంద్రబాబు నాయుడు సతీమణిని అనరాని మాటలు వైసీపీ నేతలు అంటే పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. ఒక వ్యక్తిగా ఇప్పుడు పలుకుతున్న చిలక పలుకులు ఆ రోజు ఎందుకు పలకలేదు. జగన్ మోహన్ రెడ్డికి లేఖ ఎందుకు రాయలేదు అని ముద్రగడను బుద్ధా వెంకన్న అడిగారు.

ఆ బూతులను సమర్థిస్తున్నారా?

అంబటి రాంబాబు ఇష్టారీతిన సీఎం చంద్రబాబు నాయుడును అనరాని మాటలు, బూతులతో తిట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జోగి రమేశ్ ఆయన ఇంటిపై దాడి చేశారు. వాటిని మీరు సమర్థిస్తున్నారో లేదో బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎంత అసూయ పడితే అంత ఎదుగుతారు

ముద్రగడ లాంటి వారు ఎంత అసూయ పడితే చంద్రబాబు నాయుడు అంత ఎదుగుతారని బుద్ధా వెంకన్న అన్నారు. ఆయన ఒక కులానికి, మతానికో, ప్రాంతానికో పరిమితం కాదన్నారు. ఆయన్ను అరెస్ట్ చేస్తే ప్రపంచ దేశాల్లో ఉద్యమాలు జరిగాయని గుర్తు చేశారు. అందుకే ప్రజలు చంద్రబాబును మళ్లీ సీఎం చేశారన్నారు. ఇకనైనా లేఖల్లో అసూయతో రాతలు రాయకుండా, వాస్తవాలు రాయాలని కోరారు.

Next Story