- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో పరుగులు పెడుతోన్న అభివృద్ధి.. సీన్ రివర్స్ అయిందంటూ మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని తెలంగాణ మాజీ మంత్రి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని తెలంగాణ మాజీ మంత్రి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ చంద్రబాబు గారు ఏపీలో అభివృద్ధిని పరుగులు తీయిస్తున్నారు. ప్రధాని మోడీ కూడా ఏపీ అభివృద్ధికి లక్షల కోట్లు కేటాయిస్తున్నారు. ఈ కలయికతో రాష్ట్రం అభివృద్ధి శిఖరాలు అధిరోహిస్తోంది అని మల్లారెడ్డి తెలిపారు. ప్రతి ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునే ఆనవాయితీ ఉందని ఆయన తెలిపారు. గత ఏడాది స్వామివారిని దర్శించుకున్నప్పుడు విద్యా రంగం అభివృద్ధి కావాలని కోరుకున్నానని, తన ఆధ్వర్యంలో దేశంలోనే మూడు ప్రముఖ డీమ్డ్ యూనివర్శిటీలు విజయవంతంగా నడుస్తున్నాయని చెప్పారు. తెలంగాణలో గత పదేళ్ల పాలనలో మాజీ సీఎం కేసీఆర్ అపూర్వమైన అభివృద్ధిని సాధించారని మల్లారెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో రియల్ ఎస్టేట్ మార్కెట్ కాస్త మందగించిందని, గతంలో ఆంధ్రాలో ఉన్న ఆస్తులను విక్రయించి హైదరాబాద్‌కు వచ్చేవారు కానీ ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు. ఇప్పుడు తెలంగాణలోని ప్రజలు ఏపీలో ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు. వ్యాపార అవకాశాలు అక్కడ పెరుగుతున్నాయి. ఇది చంద్రబాబు చేస్తున్న అభివృద్ధికి నిదర్శనం అని వివరించారు. మళ్లీ సీఎం కేసీఆర్ అధికారంలోకి వస్తే గతంలోలాగా తెలంగాణలో తిరిగి అభివృద్ధి జోరందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
టీడీపీ ఫ్లెక్సీలలో మల్లారెడ్డి
ఆయన రాకను పురస్కరించుకుని తిరుమలలో ఫ్లెక్సీలు వెలిశాయి. ఆ ఫ్లెక్సీలో మల్లారెడ్డి ఫొటోతో పాటు కూటమి ఎమ్మెల్యేలు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ,కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఫోటోలు ఉన్నాయి. దీంతో మల్లారెడ్డి త్వరలో టీటీడీపీ తీర్థం పుచ్చుకొని టీటీడీపీ పగ్గాలు చేపట్టనున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది.






