బీఆర్ఎస్, వైసీపీలది ఒకే అజెండా : ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు

by Thanuru Gopichand |

ఆ రెండు పార్టీలు తోడు దొంగలు.

బీఆర్ఎస్, వైసీపీలది ఒకే అజెండా : ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్, వైసీపీ (BRS, YCP) పార్టీలు రెండు ఒక్కటేనని.. ఆ రెండు పార్టీల అజెండా కూడా ఒకటేనని తెలుగుదేశం పార్టీ (TDP) ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు (Kalisetty Appala Naidu) విమర్శించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్, వైసీపీ నేతలు కుమ్మక్కై సీఎం చంద్రబాబు నాయుడుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా గోదావరి జలాల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ బురద రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ కోర్టుకు హాజరైనప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీలతో స్వాగతం పలకడం, అలాగే కేటీఆర్ ఖమ్మం వచ్చినప్పుడు వైసీపీ నేతలు ఏపీలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వారి మధ్య ఉన్న రహస్య స్నేహానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. మీ స్నేహం ఎవరికీ అభ్యంతరం కాదని, కానీ రాజకీయ లబ్ధి కోసం ప్రజలను మోసం చేయడం సరైంది కాదని హితవు పలికారు.

జగన్ మోహన్ రెడ్డి బెంగళూరులో కూర్చొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు కూడా ఆ కుట్రలో భాగస్వాములవుతున్నారని అప్పల నాయుడు ఆరోపించారు. గత ఐదేళ్ల పాలనలో జగన్ రాయలసీమ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని అన్నారు. కనీసం ఒక్క పరిశ్రమను కూడా ఆ ప్రాంతానికి తీసుకురాలేకపోయారని విమర్శించారు. అభివృద్ధిని గాలికొదిలేసి కేవలం రాజకీయ కక్ష సాధింపులకే ప్రాధాన్యత ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజలను తప్పుదోవ పట్టించడం మానేసి, నిర్మాణాత్మకమైన రాజకీయాలు చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Next Story