High court:‘ఇద్దరికీ హెల్మెట్‌ ఉండాల్సిందే’.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల(Road Accident)పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

High court:‘ఇద్దరికీ హెల్మెట్‌ ఉండాల్సిందే’.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల(Road Accident)పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హెల్మెట్‌ లేకుండా డ్రైవ్ చేయడం వల్ల జూన్ నుంచి సెప్టెంబరు వరకు 667 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ విషయం పై హైకోర్టు(High court) సీరియస్ అయింది. హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేయాలని తాము ఇచ్చిన ఆదేశాలను పోలీసులు ఎందుకు లైట్ తీసుకుంటున్నారని హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది.

పోలీసులు నేరుగా రోడ్లపై ఉంటే నేరాల సంఖ్య కూడా తగ్గుతుందని అభిప్రాయపడింది. సీసీ కెమెరాలు చూసి చర్యలు తీసుకునే విధానం తగ్గించి నేరుగా రోడ్లపైనే పోలీసులు నిలబడి చలాన్లు వసూలు చేయాలని సూచించింది. రాష్ట్రంలో 99 శాతం మంది హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్నారని.. ఇది ఎంత మాత్రం క్షేమం కాదని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వాహనాలు నడిపే వ్యక్తి కాకుండా వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని హైకోర్టు ఆదేశించింది. కొందరు సంవత్సరాలుగా చలాన్లు కట్టలేదని వారిపై సెక్షన్ 167, సెక్షన్ 206 ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. వారి వాహనాలను సీజ్ చేసి లైసెన్స్‌ రద్దు చేయాలని ఆదేశించింది.

ఒక్క హెల్మెట్ విషయమే కాకుండా ఆటోల్లో కూడా పరిమితికి మించి జనాలు ఎక్కిస్తున్న పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడింది. ఇలాంటి చట్ట విరుద్ధమైన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రచార మాధ్యమాల్లో యాడ్లు, సైన్‌బోర్డుల ద్వారా విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పింది. చలాన్లు ఎలా వేస్తున్నారు? ఎలా వసూలు చేస్తున్నారు? చట్టం కఠినంగా అమలు చేయడానికి తీసుకున్న చర్యలేంటి? రోడ్లపై తనిఖీలకు ఏర్పాటు చేసిన టీం లు ఎన్ని? అన్ని వివరాలతో అఫిడవిట్ వేయాలని పోలీసులను ఆదేశించింది. అనంతరం విచారణకు మూడు వారాలు వాయిదా వేసింది.

Next Story