ఆత్రేయపురంలో అట్టహాసంగా పడవ పోటీలు

by Thanuru Gopichand |

ఆత్రేయపురంలో అట్టహాసంగా పడవ పోటీలు
X

దిశ, వెబ్ డెస్క్ : డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ (BR Ambedkar Konaseema Jilla) జిల్లాలో సంక్రాంతి సంబరాలు (Sankranthi Sambaralu) అంబరాన్ని అంటుతున్నాయి. జిల్లాలోని ఆత్రేయపురం (Atreyapuram) మండలం తాడిపూడి వద్ద సంక్రాంతి ఉత్సవాలను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. తొలిరోజు ఈత, ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఉత్సవాల్లో రెండో రోజైన నేడు పడవ పోటీలను నిర్వహించారు. అట్టహాసంగా ప్రారంభమైన ఈ పోటీలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడులకు చెందిన పోటీదారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ పోటీల్లో మొత్తం 28 జట్లు పాల్గొంటున్నాయి. రేపటితో ఉత్సవాలు ముగియనున్నాయి.

ఆత్రేయపురంలో కేరళ తరహా పడవల పోటీలు నిర్వహించడం పట్ల నిర్వాహకులతో పాటు గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఈ ఉత్సవాలు దోహదపడతాయని చెబుతున్నారు. రేపు కూడా డ్రాగన్ పడవల పోటీలు జరుగుతాయని తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా లొల్ల లాకుల వద్ద ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేశామన్నారు. ఉత్సవాలు జరుగుతున్న మూడు రోజులు ప్రతిరోజూ సాయంత్రం ఆత్రేయపురం మహాత్మాగాంధీ కళాశాల ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. నోరూరించే కోనసీమ రుచులతో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు.

Next Story