ఆగిపోయిన బ్లోఅవుట్ మంటలు : వెల్ క్యాపింగ్ కు ఓఎన్జీసీ చర్యలు

by Thanuru Gopichand |

ఎట్టకేలకు ఇరుసుమండవాసులకు ఊరట.

ఆగిపోయిన బ్లోఅవుట్ మంటలు : వెల్ క్యాపింగ్ కు ఓఎన్జీసీ చర్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ వద్ద గత కొన్ని రోజులుగా కలకలం సృష్టించిన ఓఎన్జీసీ గ్యాస్ బావి (మోరి-5) బ్లోఅవుట్ మంటలు ఎట్టకేలకు అదుపులోకి వచ్చాయి. ఓఎన్జీసీ విపత్తు నివారణ బృందం (Crisis Management Team) నిరంతరాయంగా శ్రమించి మంటల తీవ్రతను తగ్గించడంలో విజయం సాధించింది. ప్రస్తుతం ఘటనా స్థలిలో అగ్నికీలలు ఆగిపోవడంతో అధికారులు తదుపరి కీలక దశకు సిద్ధమయ్యారు. బావిని మూసివేసే (Well Capping) పనులపై దృష్టి సారించారు.

​ఘటనా స్థలంలో విపరీతంగా పేరుకుపోయిన ఇనుప శకలాలు, కాలిపోయిన రిగ్ భాగాలను ఓఎన్జీసీ బృందం భారీ యంత్రాల సాయంతో పూర్తిగా తొలగించింది. ఈ వ్యర్థాల తొలగింపుతో బావి ముఖద్వారం (Wellhead) వద్ద పనులు చేసేందుకు మార్గం సుగమమైంది. మంటలు ఆరినప్పటికీ, లోపల ఉన్న వేడిని తగ్గించడానికి, మళ్లీ మంటలు చెలరేగకుండా ఉండేందుకు వాటర్ అంబ్రెల్లా (Water Umbrella) పద్ధతిని ఉపయోగిస్తున్నారు. గొడుగు ఆకారంలో నీటిని వెదజల్లుతూ బావి పరిసరాలను నిరంతరం శీతలీకరిస్తున్నారు.

​బావి నుంచి గ్యాస్ లీకేజీని శాశ్వతంగా అరికట్టేందుకు ఓఎన్జీసీ నిపుణులు బ్లోఅవుట్ ప్రివెంటర్ (BOP)ను సిద్ధం చేశారు. ఈ భారీ పరికరాన్ని బావి పైభాగంలో అమర్చి గ్యాస్ ప్రవాహాన్ని నియంత్రించనున్నారు. ఇందుకోసం ముంబై, ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక సాంకేతిక నిపుణుల బృందం రంగంలోకి దిగింది. వెల్ క్యాపింగ్ ప్రక్రియ అత్యంత వేగంగా, సురక్షితంగా పూర్తయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

​మరోవైపు బావిలోకి అధిక పీడనంతో సిమెంట్‌ను పంపి గ్యాస్ లీకేజీని అడ్డుకోవడానికి అవసరమైన సిమెంటింగ్ మిషన్లను కూడా ఘటనా స్థలిలో సిద్ధంగా ఉంచారు. పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి చేరుతుండటంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు సమీప గ్రామాల్లో పర్యటించి, ప్రజలు తిరిగి తమ ఇళ్లకు చేరుకోవచ్చని సూచించారు.

Next Story