విచ్ఛిన్నకర రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం : ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్

by Naga Rani Yarlagadda |

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉన్నందువల్లే దేశంలో కుల, మత విద్వేషాలు లేవని మాధవ్ అన్నారు.

విచ్ఛిన్నకర రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం : ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్
X

దిశ, వెబ్‌డెస్క్: విచ్ఛిన్నకర రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పార్టీ కార్యాలయం ముందు జెండా ఎగురవేసి.. నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశం మొదట, పార్టీ తర్వాత, స్వయం చివర అనే లక్ష్యంతో బీజేపీ నేతలు పనిచేస్తున్నారని ప్రశంసించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయ రాజకీయాలకు బీజేపీ నాంది పలికిందన్నారు. అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, మున్ముందు మరిన్ని రాష్ట్రాల్లో తమ పార్టీ సత్తా చాటుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశం అభివృద్ధికి బీజేపీ పాలన చాలా కీలకమని మాధవ్ పేర్కొన్నారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉన్నందు వల్లే కుల, మత ఘర్షణలు లేవన్నారు.

ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో ఆర్టికల్ 370 రద్దు, భవ్య రామమందిర నిర్మాణం సాకారమయ్యాయని గుర్తుచేశారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతూ.. ప్రపంచ వేదికపై శక్తిశాలి భారత్ గా సత్తా చాటుతున్నామని ఇదంతా మోదీ నాయకత్వంలోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ గా దేశాన్ని తీర్చిదిద్ది.. విశ్వ గురువు స్థానంలో భారత్ ను నిలపడమే అందరి లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో భాగస్వాములమై.. ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూనే.. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని మాధవ్ పిలుపునిచ్చారు.

Next Story