బాలింత మరణం.. తల్లిని తరలిస్తుండగా పసిబిడ్డ కూడా మృతి

by Thanuru Gopichand |

శ్రీ సత్యసాయి జిల్లాలో (Sri Sathya Sai District) మనసులను కలచివేసే ఘటన చోటు చేసుకుంది.

బాలింత మరణం.. తల్లిని తరలిస్తుండగా పసిబిడ్డ కూడా మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : శ్రీ సత్యసాయి జిల్లాలో (Sri Sathya Sai District) మనసులను కలచివేసే ఘటన చోటు చేసుకుంది. రక్తపోటు పెరిగి బాలింత మరణించగా.. ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తరలిస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగి అప్పుడే పుట్టిన బిడ్డ కూడా మరణించింది. ఈ హృదయవిదారక ఘటన జిల్లాలోని పెనుకొండలో చోటు చేసుకుంది. సత్యసాయి జిల్లా పెనుకొండ శివారులో చోటుచేసుకున్న ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఒక నిండు ప్రాణాన్ని బలిగొనడమే కాకుండా పలువురికి తీవ్ర గాయాలయ్యేలా చేసింది. పోలీసుల వివరాల ప్రకారం బసవనపల్లి గ్రామానికి చెందిన ఒక గర్భిణికి హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరిగింది. అయితే ప్రసవం తర్వాత ఆమెకు రక్తపోటు (BP) ఒక్కసారిగా పెరగడంతో మెరుగైన చికిత్స కోసం వైద్యులు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆ బాలింత మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ప్రభుత్వం కేటాయించిన 'మహాప్రస్థానం' వాహనంలో కుటుంబ సభ్యులు బయలుదేరారు.

​జాతీయ రహదారిపై పెనుకొండ సమీపంలో ప్రయాణిస్తుండగా మహాప్రస్థానం వాహనం వేగంగా వెళ్లి ముందు వెళ్తున్న మరో వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం తీవ్రతకు వాహనంలో ఉన్న అప్పుడే పుట్టిన పసికందు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన దుర్ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వెంటనే పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కన్నతల్లి మృతదేహంతో ఇంటికి వెళ్తున్న క్రమంలోనే పసిబిడ్డ కూడా మృత్యువాత పడటం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. అది చూసిన వారి కంట కన్నీరు కారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story