తిరుమలలో రీల్స్ చేస్తున్న వారికి హెచ్చరిక

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-31 12:20:28  IST  )

తిరుమలలో రీల్స్ చేస్తున్న వారికి అధికారులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు...

తిరుమలలో రీల్స్ చేస్తున్న వారికి హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala) శ్రీ‌వారి ఆల‌యం(Srivari Temple) ఎదుట, మాడ వీధుల్లో ఇటీవ‌ల కొంతమంది వెకిలి చేష్టలు చేస్తూ, నృత్యాలు ప్రదర్శిస్తున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై టీటీడీ(TTD) సీరియస్ అయింది. తిరుమలలాంటి పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంలో అభ్యంతరకర, అసభ్యకర చర్యలు అనుచితమని మండిపడింది. ఈ తరహా చర్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని, ఆధ్యాత్మిక వాతావరణానికి విఘాతం కలిగిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. భక్తి, ఆరాధనలకు తిరుమల క్షేత్రం నిలయమని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించింది. కేవలం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకే తిరుమల పరిమితం కావాలని, శ్రీవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తుల మనోభావాల పట్ల గౌరవం చూపడం ప్రతి ఒక్కరి బాధ్యతని టీటీడీ పేర్కొంది.

తిరుమలలో అసభ్యకర వీడియోలు చిత్రీకరించే వారిని టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించింది. తిరుమల పవిత్రతను భంగం కలిగేలా వ్యవహరించే వ్యక్తులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం, పవిత్రతను కాపాడడంలో సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Next Story