- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆకర్షణీయంగా అమరావతి.. ప్రపంచస్థాయిలో అభివృద్ధి!
రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల పాటు రాజధాని నగరమంటూ లేకుండా పోయిన రాష్ట్రానికి సీఎం చంద్రబాబునాయుడు చొరవతో అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించడం రాష్ట్ర ప్రజలకు తీపికబురు.

దిశ, ఏపీబ్యూరో: రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల పాటు రాజధాని నగరమంటూ లేకుండా పోయిన రాష్ట్రానికి సీఎం చంద్రబాబునాయుడు చొరవతో అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించడం రాష్ట్ర ప్రజలకు తీపికబురు. అందుకు తగ్గట్టుగా రాజధాని కోసం భూములిచ్చిన రైతన్నల త్యాగాన్ని వృథా కానీయకుండా కూటమి సర్కార్ అడుగడుగునా జాగ్రత్తలు తీసుకుంటోంది. దీంతో, అమరావతి అంతర్జాతీయ నగరాలను తలదన్నేలా రూపుదిద్దుకోబోతుంది. అందమైన నగరానికి మణిహారాలు రహదారులు. విశాలమైన రోడ్లు ఆ నగరానికి సరికొత్త అందాన్ని తెచ్చి పెడతాయి. ఇంటర్నేషనల్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దాలన్న తలంపుతో సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి సర్కార్ రాజధానిలో రహదారుల కోసం ప్రత్యేక శ్రద్ధ చూపెడుతోంది. విశాలమైన రోడ్లతో అందర్నీ ఆకర్షిస్తోంది.
ఒకే నగరంలో అన్నీ..
సాధారణంగా ఒక్కో నగరానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వాణిజ్య రాజధానిగా విజయవాడ పేరుమోసింది. అదే విజయవాడ ఇప్పుడు రాజధాని ప్రాంతానికి కూతవేటు దూరంలో ఉంది. దీంతో, అమరావతి వాణిజ్య, విద్య, వైద్య, పారిశ్రామిక రంగాలతో పాటు, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , క్రీడలు, ఆతిథ్య, పర్యాటక రంగాలతో పాటు తెలుగువారు గుండె చప్పుళ్లైన వ్యవసాయం, రాజకీయాలకు పట్టుగొమ్మలా మారింది. ప్రపంచగతిని మార్చే రంగాలన్నీ ఒకే నగరంలో ఉండడం అమరావతికి దక్కిన మరో అరుదైన రికార్డని చెప్పవచ్చు
తరలిరానున్న సంస్థలు..
అమరావతిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బిట్స్ పిలానీ, ఎక్స్‌ఎల్ఆర్ఐ, నేషనల్ లా యూనివర్సిటీ వంటి సంస్థలు, విట్, ఎస్ఆర్ఎం వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలున్నాయి. కూడ తుళ్లూరులో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కూడా ఉంది. అంతేకాకుండా, అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ కూడా ఏర్పాటు కానున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సంస్థలన్నీ అమరావతిలో బ్రాంచ్‌లను ఏర్పాటు చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇప్పటికే రాజధానిలో క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్కు ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇందుకు సంబంధించి ఎంఓయూను ర్యాటిఫై చేస్తూ ఐటీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, అగ్రశ్రేణి ఐటీ సంస్థలు టీసీఎస్, ఎల్ అండ్ టీ , ఐబీఎం సంస్థలు నిర్మాణ పనులు చేపట్టనున్నాయి. మరో వైపు అమరావతిలో తొలి ఐటీ టవర్ నిర్మాణానికి ఎల్‌అండ్‌టీ సిద్ధమైంది. ఐటీ టవర్ నిర్మాణానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పది ఎకరాలు కేటాయించింది. మంత్రి నారా లోకేశ్ నియోజకవర్గమైన మంగళగిరికి సమీపంలోని నిడమర్రులో ఐటీ టవర్‌ను ప్రభుత్వం నిర్మించనుంది. రాబోయే కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్నాలజీ ప్రధాన భూమిక పోషిస్తాయన్న అంచనాల నేపథ్యంలో వాటికి అనుగుణంగా ఈ టవర్ నిర్మాణం జరగనుంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్, కర్నాటక రాజధాని బెంగళూరుకు పోటీగా అమరావతిని కూడా ఐటీ ఉద్యోగులకు ప్రధానకేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలను చేపడుతోంది.
సినీ పరిశ్రమ దూరం..
రాష్ట్రం నలుమూలలా అభివృద్ధి జరగాలంటే వికేంద్రీకరణ ద్వారా మాత్రమే సాధ్యమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని సమాచారం. అందుకే, ఐటీ రంగంతో పాటు సినీ పరిశ్రమను రాజధానితో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా ప్రతిష్టాత్మక ఐటీ సంస్థలను విశాఖ పట్టణానికి పంపిస్తోంది. సినీ పరిశ్రమను విశాఖ, తిరుపతి నగరాల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. స్టూడియోల నిర్మాణం, సినీ పరిశ్రమ అభివృద్ధికి తిరుపతి, విశాఖ నగరాలు అనువైన ప్రదేశాలని రాష్ట్ర ప్రభుత్వ అంచనా
వికేంద్రీకరణ ప్లాన్ అందుకే
నవ నగరాల లక్ష్యంతో రాజధానిని అభివృద్ధి చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఐటీ, చలన చిత్ర పరిశ్రమలను ఇతర నగరాలకు తరలించడం వెనుక మరో ప్రధాన కారణముందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అభివృద్ధి మొత్తం అమరావతిలోనే కేంద్రీకరించి, తద్వారా సంపద సృష్టిస్తే .. ఆ ఫలితాలను అనుభవించేందుకు, దుర్భుద్ధితో కొన్ని రాజకీయ శక్తులు ప్రజల్లో విద్వేషాన్ని నింపే ప్రమాదముంది. అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరం కోసం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించినట్లు మరోసారి ప్రాంతీయవాదం చిచ్చు ప్రజల్లో రగల కూడదని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఉత్తరాంధ్ర, రాయలసీమ రాష్ట్రాల కోసం ప్రజా కంటక శక్తులు ఉద్యమాలు లేవనెత్తే అవకాశం లేకుండా దూరదృష్టితో అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టిందని భోగట్టా.






