ఫీజు కట్టలేదని దారుణం: విద్యార్థినితో బాత్రూంలు కడిగించిన వైనం

by Kema Shiva Kumar |

తిరుపతి శ్రీ వికాస్ నర్సింగ్ కళాశాలలో అమానుషం. ఫీజు ఆలస్యమైందని విద్యార్థిని నినితతో బాత్రూంలు కడిగించి,

ఫీజు కట్టలేదని దారుణం: విద్యార్థినితో బాత్రూంలు కడిగించిన వైనం
X

దిశ, వెబ్‌డెస్క్: మంచి, చెడులు చెప్పాల్సిన విద్యాసంస్థల్లో రోజురోజుకు మానవత్వం మంటగలిసిపోతోంది. ఫీజు చెల్లించలేదన్న నెపంతో ఒక విద్యార్థిని పట్ల కాలేజీ యాజమాన్యం అత్యంత అమానుషంగా ప్రవర్తించింది. తిరుపతి (Tirupati)లోని శ్రీ వికాస్ నర్సింగ్ కళాశాల (Sri Vikas Nursing College)లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని శ్రీ వికాస్ నర్సింగ్ కళాశాలలో నినిత అనే విద్యార్థిని నర్సింగ్ కోర్సు చదువుతోంది. మొదటి ఏడాదికి సంబంధించి రూ.2 లక్షల ఫీజును ఆమె సకాలంలోనే చెల్లించింది. అయితే, సెకండియర్‌కు సంబంధించిన ఫీజు చెల్లింపులో స్వల్ప జాప్యం జరిగింది. దీన్ని సాకుగా తీసుకున్న కాలేజీ యాజమాన్యం ఆమెపై వేధింపులకు దిగింది.

మూడు రోజుల పాటు నరకం..

ఫీజు కట్టలేదని నినిత (Ninita)ను కాలేజీ యాజమాన్యం తీవ్రంగా వేధించింది. ఏకంగా 3 రోజుల పాటు ఆమెతో కాలేజీలోని బాత్రూంలను కడిగించడమే కాకుండా, గంటల తరబడి గోడ కుర్చీ వేయించి దండన విధించారు. ఒక విద్యార్థిని అని కూడా చూడకుండా ఆమెతో వెట్టి చాకిరీ చేయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం బయటకు రావడంతో విద్యార్థి సంఘాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. కళాశాల వద్ద భారీ ఎత్తున ఆందోళనకు దిగాయి. బాధితురాలికి న్యాయం చేయాలని, విద్యార్థినిని వేధించిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యాజమాన్యంపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి, కళాశాల గుర్తింపు రద్దు చేయాలన్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు జరిగిన ఘటనపై విచారణ జరుపుతున్నారు.

Next Story