గ్రామ, వార్డు సచివాలయాల సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం..

by Kema Shiva Kumar |

ఆంధ్రప్రదేశ్ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇవాళ గ్రామ, వార్డు సచివాలయ సవరణ బిల్లును మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెట్టారు.

గ్రామ, వార్డు సచివాలయాల సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇవాళ గ్రామ, వార్డు సచివాలయ సవరణ బిల్లును మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై అన్ని పార్టీల నేతలు ప్రసంగించి తమ అభిప్రాయాలను సభ దృష్టి తీసుకొచ్చారు. దీంతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు గ్రామ, వార్డు సచివాలయ బిల్లును ఆమోదం పొందినట్లుగా ప్రకటించారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలను జనాభా ఆధారంగా A, B, C కేటగిరీలుగా విభజించింది. ఈ విభజన ప్రధానంగా సిబ్బంది కేటాయింపు, సేవల సమర్థతను మెరుగుపరచడానికి చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కొన్ని సచివాలయాల్లో సిబ్బంది అధికంగా, మరికొన్ని చోట్ల తక్కువగా ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది. దీంతో పౌర సేవలు సమర్థవంతంగా అందడం లేదని, పనిభారం సమానంగా లేకపోవడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని భావించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు, జనాభా ఆధారంగా సిబ్బందిని కేటాయించి, పనిభారం సమానంగా ఉండేలా హేతుబద్ధీకరణ చేపట్టారు. ఇందులో భాగంగా 5 ఏళ్లకు‌పైగా ఒకేచోట పని చేస్తున్న ఉద్యోగులను బదిలీ చేయడం తప్పనిసరి చేశారు. అలాగే, ఉద్యోగులు తమ సొంత ఊరిలో లేదా సొంత మండలంలో పోస్టింగ్ పొందకూడదని నిబంధన కూడా విధించారు. ఇక సచివాలయ ఉద్యోగుల హాజరును బయోమెట్రిక్ ఆధారంగా నమోదు చేయాలని, దీనిని వేతనాలతో అనుసంధానం చేయనున్నారు. ఉదయం డ్యూటీకి వచ్చినప్పుడు, సాయంత్రం విధులు ముగిసినప్పుడు GSWS అటెండెన్స్ యాప్‌లో రెండుసార్లు హాజరు నమోదు తప్పనిసరి చేశారు.

గ్రామ, వార్డు సచివాలయాలను రియల్‌టైం గవర్నెన్స్ కార్యాలయాలుగా మార్చాలని, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమ అభివృద్ధి, ఉపాధి కల్పన, మార్కెటింగ్ వంటి కార్యకలాపాలకు కేంద్రాలుగా ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సచివాలయాల ద్వారా జారీ చేసే సర్టిఫికెట్లపై ప్రభుత్వ లోగో మాత్రమే ఉండాలని, రాజకీయ చిహ్నాలు లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలతో కలిసి సాంకేతిక శిక్షణ అందించాలని ప్రణాళికలు రచించారు. గ్రామ సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, ఏఎన్‌ఎం, సర్వే అసిస్టెంట్, ఇంజనీర్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉండనున్నాయి. వార్డు సచివాలయాల్లో వార్డు రెవెన్యూ కార్యదర్శి, హెల్త్ సెక్రటరీ, ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ కార్యదర్శి వంటి పోస్టులు నియమించబడతాయి. ప్రతి జిల్లాలో సచివాలయాల పర్యవేక్షణ కోసం మూడంచెల విధానాన్ని రూపొందించనున్నారు.

Next Story