శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం.. ఆర్జిత సేవలు రద్దు

by Naga Rani Yarlagadda |

ఈ నెల 20వ తేదీన దీపావళి సందర్భంగా.. తిరుమల శ్రీవారి ఆలయంలో వేదపండితులు శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు.

శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం.. ఆర్జిత సేవలు రద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: ఈనెల 20వ తేదీన దీపావళి సందర్భంగా.. తిరుమల శ్రీవారి ఆలయంలో వేదపండితులు శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆ రోజున ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను రద్దు చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. స్వామివారికి తోమాల, అర్చన సేవలను మాత్రం ఏకాంతంగా నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

అక్టోబర్ 20, సోమవారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు ఉన్న ఘంటామండపంలో దీపావళి ఆస్థాన వేడుక జరుగుతుంది. ఇందులో భాగంగా శ్రీమలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటు చేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్ కు అభిముఖంగా వేంచేపు చేస్తారు. సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారు. ఆ తర్వాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఈ ఘట్టంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది. సాయంత్రం 5 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని.. తిరుమాఢ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

Next Story