ఆదాయంలో సరికొత్త రికార్డు సృష్టించిన ఏపీఎస్ ఆర్టీసీ

by Thanuru Gopichand |

సురక్షితంగా గమ్యస్థానాలకు చేరిన లక్షలాది మంది ప్రయాణికులు.

ఆదాయంలో సరికొత్త రికార్డు సృష్టించిన ఏపీఎస్ ఆర్టీసీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఆదాయం (Occupancy) సమూపార్జనలో ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) సరికొత్త రికార్డును సృష్టించింది. ఒక్కరోజులోనే అత్యధిక ప్రయాణికులను (Passengers) గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా అధిక ఆదాయాన్ని సంపాదించింది. ఈ విషయమై ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు మాట్లాడుతూ జనవరి 19న ఒక్కరోజూ ఆర్టీసీకి రూ.27.68 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. కేవలం ఒక్కరోజులోనే సుమారు 50.6 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చడం జరిగిందన్నారు. ఇది ఏపీఎస్ ఆర్టీసీ చరిత్రలోనే కేవలం ఒక్కరోజులో అత్యధిక ఆదాయం సాధించిన రికార్డుగా నిలుస్తోందన్నారు.

సంక్రాంతిని పురస్కరించుకొని చాలా మంది స్వగ్రామాలకు వచ్చారన్నారు. వారందరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుగు ప్రయాణం అయ్యేందుకు ఆర్టీసీ తరపున ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. తద్వారా వీలైనంత ఎక్కువ మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేయడంతో ఆర్టీసీ విజయం సాధించిందన్నారు. ఈ క్రమంలోనే రికార్డు స్థాయి ఆదాయం ఆర్జించడం జరిగిందని వెల్లడించారు.

ఈ విషయంపై ఏపీఎస్ఆర్టీసీ ఎండీ తిరుమలరావు స్పందిస్తూ డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బంది, సూపర్ వైజర్లు అద్భుతంగా పని చేశారన్నారు. వారందరి పరస్పర సహకారం, సమన్వయం కారణంగా ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోగలిగారని పేర్కొన్నారు. రికార్డు స్థాయి ఆదాయాన్ని సాధించిన సందర్భంగా వారందరినీ ఆర్టీసీ ఎండీ ప్రత్యేకంగా అభినందించారు.

Next Story