ఓ వైపు ఎండ, మరోవైపు వర్షాలు..ఈ 46 మండలాల్లో జాగ్ర‌త్త‌

by velandi.Saikiran |   (  Updated:2026-04-20 22:31:01  IST  )

రాష్ట్రంలో ఎండ, వడగాలులు, ఉక్కపోత తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

ఓ వైపు ఎండ, మరోవైపు వర్షాలు..ఈ 46 మండలాల్లో జాగ్ర‌త్త‌
X

వడగాలులు, ఉక్కపోత

- రాష్ట్రంలో ఎండ తీవ్రత

* 46 మండలాల్లో తీవ్ర వడగాల్పుల హెచ్చరిక

* ఉత్తరాంధ్రలో అధిక ప్రభావం

* కొన్ని జిల్లాల్లో వర్ష సూచన

* విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో ఎండ, వడగాలులు, ఉక్కపోత తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మంగళవారం రాష్ట్రంలోని 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 29 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశం ఉందని అన్నారు. బుధవారం నాటికి ఈ ప్రభావం మరింత పెరిగి 54 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 15 మండలాల్లో వడగాలులు నమోదయ్యే అవకాశముందని వెల్లడించారు.

* ఉత్తరాంధ్రలో అధిక ప్రభావం....

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని అనేక మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఎండీ ప్రఖర్ జైన్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి, అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అదనంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అనకాపల్లి తదితర జిల్లాల్లోని 29 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. సోమవారం రాష్ట్రంలో పలుచోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43–44 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. మొత్తం 289 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

* కొన్ని జిల్లాల్లో వర్ష సూచన....

ద్రోణి ప్రభావంతో మంగళవారం అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కూడా అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Next Story