నేటి నుంచి ఎన్టీఆర్ వైద్యసేవలు నిలిపివేత

by Naga Rani Yarlagadda |

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ఎన్టీఆర్ వైద్యసేవలు నిలిచిపోయాయి. దీంతో ఆస్పత్రుల్లో వైద్యం అందక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నేటి నుంచి ఎన్టీఆర్ వైద్యసేవలు నిలిపివేత
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ప్రైవేటు స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. తమకు ప్రభుత్వం నుంచి రావలసిన వేల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం (ASHA) ప్రకటించింది. ఎన్టీఆర్ వైద్యసేవలు నిలిపివేయడంతో ఆ పథకం కింద చికిత్స పొందుతున్న, పొందాలనుకున్న పేషంట్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎన్టీఆర్ వైద్యసేవ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలంగా చెల్లించడం లేదని ఆస్పత్రులు యాజమాన్యాలు పేర్కొన్నాయి. ఇప్పటి వరకూ రూ.3000 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని, దీంతో ఆస్పత్రుల నిర్వహణ భారమైందని వాపోతున్నారు. సిబ్బంది జీతాలు, మందుల కొనుగోళ్లకు కూడా నిధులు లేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

యూనివర్సల్ హెల్త్ స్కీమ్ పైనా అభ్యంతరం

కాగా.. ఇటీవల ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన యూనివర్సల్ హెల్త్ స్కీమ్ పై కూడా ఆస్పత్రుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. పాత బకాయిలను చెల్లించకుండా కొత్తపథకాల గురించి భారీ ప్రకటనలు చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. బకాయిలు చెల్లించకుండా పథకాలను విస్తరించడం వల్ల ఉపయోగం లేదని, అవి ప్రకటనలకే పరిమితమవుతున్నాయని తెలిపింది. కాగా.. ఎన్టీఆర్ వైద్యసేవలు నిలిపివేయడంపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోకుంటే పేద ప్రజలకు సకాలంలో వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడే ఛాన్సుంది.

Next Story