ఏపీ పంచాయతీరాజ్ శాఖకు జాతీయ పురస్కారాలు! డిప్యూటీ సీఎం పవన్ హర్షం

by Ramesh Naini |

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ వరుసగా రెండో ఏడాది దీనదయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ జాతీయ పురస్కారాలకు ఎంపిక కావడం ఆనందంగా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.

ఏపీ పంచాయతీరాజ్ శాఖకు జాతీయ పురస్కారాలు! డిప్యూటీ సీఎం పవన్ హర్షం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ వరుసగా రెండో ఏడాది దీనదయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ జాతీయ పురస్కారాలకు ఎంపిక కావడం ఆనందంగా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా మహిళలకు స్నేహపూర్వక వాతావరణంగల పంచాయతీగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండల పరిధిలోని బొక్కసంపాలెం జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం గెలుచుకోవడం మరింత సంతృప్తినిచ్చిందన్నారు. సుపరిపాలనలో విశాఖపట్నం జిల్లా శృంగవరం గ్రామ పంచాయతీ మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో పేదరిక నిర్మూలన, మెరుగైన జీవనోపాధి అంశాల్లో వైఎస్ఆర్ కడప జిల్లా చెమ్ముళ్లపల్లి గ్రామం రెండో స్థానం దక్కించుకుందని వెల్లడించారు.

మౌలిక సదుపాయాల కల్పనలో స్వయం సమృద్ధి సాధించిన పంచాయతీల్లో ప్రకాశం జిల్లా గుండమల గ్రామ పంచాయతీ మూడో స్థానంలో నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం పరిధిలోని కుప్పం మండలం జాతీయ స్థాయిలో 3వ అత్యుత్తమ మండలంగా ఎంపికయ్యిందని వెల్లడించారు. గత ఏడాది కూడా వివిధ విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ 4 అవార్డులు గెలుచుకోవడాన్ని ఈ సందర్భంగా తెలిపారు.

Next Story