liquor case: ఏపీ మద్యం కేసు.. అవినాశ్‌ రెడ్డికి రెగ్యులర్‌ బెయిల్‌ నిరాకరించిన సుప్రీంకోర్టు

by Ramesh Naini |

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో నిందితుడు ముప్పిడి అవినాశ్‌రెడ్డికి అత్యున్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది.

liquor case: ఏపీ మద్యం కేసు.. అవినాశ్‌ రెడ్డికి రెగ్యులర్‌ బెయిల్‌ నిరాకరించిన సుప్రీంకోర్టు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో నిందితుడు ముప్పిడి అవినాశ్‌రెడ్డికి అత్యున్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసేందుకు నిరాకరించింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్‌షీట్‌ దాఖలైందని, కాబట్టి నిందితుడికి రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేయాలని అవినాశ్‌రెడ్డి తరఫు న్యాయవాది ధర్మాసనానికి విన్నవించారు. అయితే, ఈ వాదనతో సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌ మాల్యా, జస్టిస్‌ విపుల్‌ పంచోలిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఏకీభవించలేదు. ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన తర్వాత కూడా దర్యాప్తు సంస్థలు నిందితులను కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

వారం రోజులకు విచారణ వాయిదా..

అవినాశ్‌రెడ్డిని కస్టడీకి కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ట్రయల్‌ కోర్టు ఇచ్చే ఉత్తర్వుల కోసం వేచి చూడాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. ట్రయల్‌ కోర్టు నిర్ణయం వెలువడే వరకు ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ జరగదని కోర్టు పేర్కొంది.

Next Story