దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధిలో ఏపీ వెనుకంజ : డా.నిమ్మగడ్డ రమేష్ కుమార్

by Disha Web Desk 21 |
దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధిలో ఏపీ వెనుకంజ : డా.నిమ్మగడ్డ రమేష్ కుమార్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలోని రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలపై దృష్టి సారించాలని మిగిలిన సమయంలో అభివృద్ధి కోసం కృషి చేయాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ జనరల్ సెక్రటరీ డా. నిమ్మగడ్డ రమేష్ కుమార్ సూచించారు. జనచైతన్య వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం గుంటూరులోని జనచైతన్య వేదిక హాల్‌లో జరిగిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డా. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డా. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రసంగించారు. గుంటూరు జిల్లాలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, కొండా వెంకటప్పయ్య పంతులు, కన్నెగంటి హనుమంతు, పర్వతనేని వీరయ్య, వావిలాల గోపాలకృష్ణయ్య లాంటి మహనీయులు కృషిచేసిన ఫలితంగా ఎంతో అభివృద్ధి జరిగిందని స్పష్టం చేశారు. దుగ్గిరాల వన్ సేవా ట్రస్ట్ (దోస్త్) ద్వారా తన స్వగ్రామానికి చేస్తున్న కృషిని వివరించారు. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధిలో ఏపీ వెనుకంజలో ఉందని.. తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అవస్థాపన సౌకర్యాలు లేకపోవడం, పరిశ్రమలు అభివృద్ధి కాకపోవడం, రాజకీయ సంకల్పం లేకపోవడంతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కనుమరుగువుతున్నాయని వ్యాఖ్యానించారు. పెట్టుబడులు రాకపోగా ఇతర ప్రాంతాలకు ఉన్న కంపెనీలు తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రాజధానిని అభివృద్ధి చేసుకోలేక పోవడం వలన గుంటూరు జిల్లా ఎంతో వెనుకబడింది అని చెప్పుకొచ్చారు. విద్వేషాలు, కక్షసాధింపులు, వెంటాడటం మాని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని డా.నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నారు.


Next Story

Most Viewed