మండుటెండలు, వడగాల్పులపై హోంమంత్రి అనిత సమీక్ష.. యాక్షన్ ప్లాన్ రెడీ

by Naga Rani Yarlagadda |

మండుటెండలు, వడగాల్పులపై హోంమంత్రి అనిత సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

మండుటెండలు, వడగాల్పులపై హోంమంత్రి అనిత సమీక్ష.. యాక్షన్ ప్లాన్ రెడీ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో భానుడి భగభగలు మొదలవుతున్న వేళ ఏపీ ప్రభుత్వం ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. ఎండ తీవ్రత, వడగాల్పుల సంసిద్ధతపై విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేట్ హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్- 2026 తో అధికారులు ముందుకు వెళ్లాలని ఆదేశించారు.

వేసవిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. వడదెబ్బ కారణంగా ఒక్క మరణం కూడా సంభవించకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. వడదెబ్బ బాధితుల కోసం ఆసుపత్రుల్లో ప్రత్యేక బెడ్లు, అవసరమైన మందులు, అంబులెన్సులను సిద్ధం చేయాలని తెలిపారు. మార్కెట్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి జనసమ్మర్థం గల ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థల సహకారంతో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. వేసవిలో గృహ అవసరాలకు, తాగునీటి సరఫరాకు ఆటంకం కలగకుండా నిరంతర విద్యుత్ అందించాలని సూచించారు. వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండే వృద్ధులు, చిన్నపిల్లలు, ఎండలో పని చేసే కూలీల ఆరోగ్యంపై ప్రత్యేక నిఘా ఉంచాలని పేర్కొన్నారు. మూగజీవాలకు తాగునీరు, నీడ కల్పించేలా పశుసంవర్ధక శాఖ తగిన సూచనలు జారీ చేయాలని తెలిపారు. అధికారులంతా క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసి, హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.

Next Story