BREAKING: తిరుమల పరకామణి కేసు.. సీఐడీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-10-27 07:49:03  IST  )

తిరుమల శ్రీవారి పరకామణి కేసును నేడు హైకోర్టు ధర్మాసనం విచారించింది.

BREAKING: తిరుమల పరకామణి కేసు.. సీఐడీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారి పరకామణి కేసును (Srivari Parakamani Theft Case) నేడు హైకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కేసు విచారణ తీరుపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పరకామణిలో అక్రమాలు జరుగుతున్నట్లు ఆధారాలున్నా.. ఎందుకు చర్యలు తీసుకోలేదని కోర్టు ప్రశ్నించింది. టీటీడీ ఈఓ, సీబీఎస్ఓను హైకోర్టుకు హాజరు కావాలని తెలిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. పరకామణి కేసుపై సీఐడీతో దర్యాప్తు (CID Investigation) చేపట్టాలని ఆదేశించింది. అలాగే నిందితుడు రవిపై ఏసీబీతో దర్యాప్తు చేయించాలని ఆదేశాలు జారీ చేసింది. రవి కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను పరిశీలించి, ఆ నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించాలని ఆదేశించింది. ఇక పరకామణి అక్రమాలపై ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన సాధు పరిషత్ కు చెందిన పిటిషన్ దారుకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వీటన్నింటినీ పరిశీలించిన హైకోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది.

పరకామణి చోరీ కేసును ఏపీ ప్రభుత్వం (AP Government) సీరియస్ గా తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో రవికుమార్ పరకామణి నుంచి పలు విడతలుగా నగదు చోరీ చేస్తూ సీసీ కెమెరాలకు చిక్కారు. ఇందుకు సంబంధించిన ఫుటేజీలు కూడా ఉన్నాయి. 2023లో పరకామణి చోరీ కేసు నమోదయింది. దీనిపై అదే ఏడాది టీటీడీ విజిలెన్సుకు ఫిర్యాదు అందగా.. రవికుమార్ సుమారు రూ.100 కోట్ల సొమ్మును కొల్లగొట్టినట్లు పేర్కొంది. దీనిపై నాటి టీటీడీ అధికారులు సరైన దర్యాప్తు చేయకుండానే లోక్ అదాలత్ లో రాజీ చేయించారు. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దానిని న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.

Next Story