ఏపీ హస్తకళలకు అంతర్జాతీయ గుర్తింపు

by Thanuru Gopichand |

హర్షం వ్యక్తం చేసిన మంత్రి సవిత.

ఏపీ హస్తకళలకు అంతర్జాతీయ గుర్తింపు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ హస్తకళల (AP Handicrafts) వైభవం రాష్ట్రం.. దేశం దాటి విదేశాలకు సైతం చేరుతోంది. సింగపూర్ (Singapore) లోని భారత హైకమిషనర్ (Indian High Commission) 400 గిఫ్ట్ బాక్సుల కోసం లేపాక్షికి (Lepakshi) ఆర్డర్ ఇచ్చింది. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వివరాల్లోకి వెళ్తే జనవరి 26న సింగపూర్ లోని భారత దౌత్య కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు (Republic Day Celebrations) జరగనున్నాయి. అక్కడకు వచ్చే ముఖ్య ఆహ్వానితులుగా గిఫ్ట్ లను ఇవ్వాలని హైకమిషన్ నిర్ణయించింది. అందుకోసం ఏపీకి చెందిన లేపాక్షి గిఫ్ట్ బాక్సులను (Gift Box) ఎంపిక చేసుకుంది. గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం ఏకంగా 400 గిఫ్ట్ బాక్సులను ఆర్డర్ చేసింది. ఈ గిఫ్ట్ బాక్సుల్లో సీతాదేవి లెదర్ పప్పెట్రీ, ఏనుగు ఆకారపు బ్యాగేజ్ ట్యాగ్, హ్యాండ్ పెయింటెడ్ కోస్టర్ వంటి అద్భుతమైన కళారూపాలను పొందుపరిచారని తెలుస్తోంది. గత ఏడాది దిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్ లో ఏపీ హస్తకళల శకటానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఇటువంటి ఆర్డర్లు రావడానికి అది దోహదపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

హర్షం వ్యక్తం చేసిన మంత్రి సవిత

ఏపీ హస్తకళలకు ప్రపంచ స్థాయి గుర్తింపు రావడంపై రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. ఏపీ హస్తకళల గిఫ్ట్ బాక్స్ అందజేయాలని భారత్ హైకమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. హస్తకళలకు ఏపీలోని కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. కళారూపాల తయారీలో ఆధునిక హంగులు అద్దేలా కళాకారులకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లేపాక్షి షోరూంల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. విశాఖపట్నం, అనంతపురం, కడప సహా ప్రధాన కేంద్రాల్లోని 15 షోరూంలను ఆధునీకరించడం జరిగిందని వెల్లడించారు. త్వరలోనే ఇతర దేశాల్లోనూ లేపాక్షి షోరూంల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ప్రకటించారు.

Next Story