- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పునరుత్పాదక ఇంధన తయారీలో ఏపీ ప్రభుత్వ కీలక అడుగు
పునరుత్పాదక ఇంధన కేంద్రంగా అవతరించనున్న ఏపీ.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీనీ పునరుత్పాదక ఇంధన తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. తిరుపతి జిల్లాలోని నాయుడుపేట (Naidupeta) మల్టీ-ప్రొడక్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (MPSEZ)లో భారీ సోలార్ సెల్, మాడ్యూల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి వెబ్‌సోల్ ఎనర్జీ సిస్టమ్ లిమిటెడ్ (Websol Energy System Ltd) ప్రతిపాదనకు ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. దాదాపు రూ. 3,538 కోట్ల భారీ పెట్టుబడితో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్ర పారిశ్రామిక రంగంలో కొత్త ఉత్తేజం రానుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, "వేగం అంటే ఆంధ్రప్రదేశ్" (#ChooseSpeedChooseAP) అనే నినాదంతో పెట్టుబడిదారులను ఆహ్వానించారు.
ఈ ప్రాజెక్ట్ వివరాల ప్రకారం నాయుడుపేటలో మొత్తం 8 గిగావాట్ల (GW) సామర్థ్యం కలిగిన ఇంటిగ్రేటెడ్ యూనిట్‌ను రెండు దశల్లో నిర్మించనున్నారు. ఇందులో 4 GW సోలార్ సెల్స్, 4 GW సోలార్ మాడ్యూల్స్ ఉత్పత్తి చేయనున్నారు. ఈ తయారీ కేంద్రం దాదాపు 120 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. 2027 జూలై నాటికి మొదటి దశ, 2028 జూలై నాటికి రెండో దశ వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్లాంట్ నిర్వహణకు అవసరమైన విద్యుత్తును తక్కువ ఖర్చుతో పొందేందుకు వీలుగా, 300 ఎకరాల్లో 100 మెగావాట్ల (MW) సామర్థ్యం గల సొంత సోలార్ పవర్ ప్లాంట్‌ను కూడా వెబ్‌సోల్ ఏర్పాటు చేయనుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ భారీ పెట్టుబడి వల్ల రాష్ట్రానికి ఆర్థికంగానే కాకుండా సామాజికంగా కూడా గొప్ప ప్రయోజనం చేకూరనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 2,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా. భూమి కేటాయింపు, విద్యుత్ సుంకం మినహాయింపు, ఫిక్స్‌డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ సబ్సిడీ వంటి ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను ప్రభుత్వం ఈ సంస్థకు ప్రకటించింది. నాయుడుపేట ప్రాంతం ఇప్పటికే టాటా పవర్, ప్రీమియర్ ఎనర్జీస్ వంటి దిగ్గజ సంస్థలకు నిలయంగా మారడంతో ఆంధ్రప్రదేశ్ త్వరలోనే దేశంలోని అతిపెద్ద సోలార్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా అవతరించనుందని తెలుస్తోంది. ఇది భారత ప్రభుత్వ 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యానికి, 2030 నాటికి 500 GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యానికి గొప్ప ఊతమిస్తుందని ప్రభుత్వ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.






